
తిరువనంతపురం: ఎప్పట్లాగే రెస్టారెంట్ నుంచి వారు ఆహారాన్ని డెలివరీకి ఆర్డర్ చేశారు. ఆ ఫుడ్ ఐటమ్ డోర్ డెలివరీ అయింది. తొలుత ఆ మహిళ తన బిడ్డకు ఆహారాన్ని తినిపించింది. ఆ తర్వాత తాను కూడా తినడానికి సిద్ధమైంది. తన పార్సిల్ విప్పగానే అందులో ఆహారంతోపాటు సగం వేలు పొడవు ఉన్న పాము చర్మం కనిపించింది. ఆ మహిళ పాము చర్మాన్ని చూసి ఖంగు తిన్నది. వెంటనే ఆ ఫుడ్ ఐటమ్ నుంచి దూరంగా జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది.
తిరువనంతపురం నివాసి ప్రియా గత గురువారం సిటీలోని నెడుమంగడు ఏరియాలోని రెస్టారెంట్ నుంచి రెండు పరోటాలు ఆర్డర్ చేసింది. రెండు పరోటాల ఐటమ్‌ను సిబ్బంది ఇంటికి డెలివరీ చేశారు. తొలుత తన బిడ్డకు తినిపించి తర్వాత తాను తినడం మొదలు పెట్టింది. ఇంతలో పరోటాలను చుట్టిన రాపింగ్ కవర్‌లో అర వేలు పొడవుతో పాము చర్మం కనిపించింది.
ఆమె వెంటనే ఈ ఘటన గురించి పోలీసులకు తెలిపింది. వారు ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధి కారుల వద్దకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో ఆమె తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రియా ఫిర్యాదు అందిన తర్వాత స్థానిక మున్సిపల్ అధికారులు ఆ రెస్టారెంట్‌పై తనిఖీలు చేపట్టారు. ఆ రెస్టారెంట్‌లో పరిశుభ్రమైన వాతావరణం లేదని పేర్కొన్నారు. దీంతో వెంటనే రెస్టారెంట్‌ను మూసేయాలని ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాలతో ఆ రెస్టారెంట్ ప్రస్తుతం మూతబడింది.
నెడుమంగడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అర్షిత బషీర్ ఈ విషయంపై మాట్లాడుతూ, ఫుడ్‌ను ప్యాక్ చేయడానికి ఉపయోగించిన పేపర్‌లో పాము చర్మం కనిపించినట్టు ప్రాథమికంగా తెలిసిందని వివరించారు. ఆ పరోటా పాము చర్మానికి తాకినట్టూ పేర్కొన్నారు. రెస్టారెంట్ కిచెన్‌లో సరిపడా వెలుతురు లేదని, పరిశుభ్రంగా లేదని వివరించారు. ఆ రెస్టారెంట్ లైసెన్స్‌ను ఎత్తేశామని, రెస్టారెంట్ యజమానికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.