బంగ్లాదేశ్ బార్డర్‌లో స్మగ్లర్లు.. అర్ధరాత్రి ఎన్‌కౌంటర్‌లో ఓ స్మగ్లర్ హతం

Published : Jun 05, 2022, 04:02 PM IST
బంగ్లాదేశ్ బార్డర్‌లో స్మగ్లర్లు.. అర్ధరాత్రి ఎన్‌కౌంటర్‌లో ఓ స్మగ్లర్ హతం

సారాంశం

భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో స్మగ్లర్లు కలకలం రేపారు. ఫెన్సెడైల్‌ను అక్రమంగా తరలిస్తూ సుమారు పది నుంచి పదిహేను మంది స్మగ్లర్లు బీఎస్ఎఫ్ జవాన్ల కంటబడ్డారు. వారిని వారించగా.. వినలేదు. అడ్డుకున్న జవాన్లపైనా దాడికి పాల్పడగా.. ఓ జవాన్‌ కాల్పులు జరిపాడు. ఇందులో ఒకరు మరణించాడు. మిగతా వారు పరారయ్యారు.

న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో స్మగ్లర్లు రెచ్చిపోయారు. రాత్రి 3 గంటల సమయంలో ఫెన్సెడైల్‌ను స్మగుల్ చేస్తున్న ఓ ముఠా బార్డర్ ఏరియాలో సంచరిస్తూ కనిపించారు. వీరి కదలికలను కనిపెట్టిన భారత జవాన్లు అలర్ట్ అయ్యారు. వారిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. కానీ, వారు అందుకు విరుద్ధంగా జవాన్లపైనే దాడికి దిగారు. రాళ్లు, పదునైనా ఆయుధాలతో జవాన్లపై దాడి చేశారు. ఇందుకు ప్రతిగా జవాన్లు ఎదురుదాడికి దిగారు. ఈ దాడిలో ఓ స్మగ్లర్ హతం అయ్యాడు. బుల్లెట్ గాయాలతో ఈ స్మగ్లర్ హతమవ్వగానే మిగతా స్మగ్లర్లూ అందరూ పారిపోయారు. అర్ధరాత్రి కావడంతో ఆ చీకటిలో వారిని పట్టుకోవడం సాధ్యం కాలేదు.

పశ్చిమ బెంగాల్ సరిహద్దు జిల్లా మున్షీరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున బార్డర్ ఔట్ పోస్టు సాగర్‌పారా, 141 బెటాలియన్ దగ్గర ఈ దాడి జరిగింది. బీఎస్‌ఎఫ్ ఇంటెలిజెన్స్ శాఖకు విశ్వసనీయ వర్గాల నుంచి స్మగ్లర్ల గురించిన సమాచారం వచ్చింది. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు పక్కా నిఘాతో సరిహద్దులో కాపు కాశారు. రాత్రి సుమారు 3 గంటల ప్రాంతంలో పది నుంచి 15 మందితో కూడిన ఓ స్మగ్లర్ల గుంపు సరిహద్దు ఏరియాకు వచ్చారు.

ఈ విషయం వెంటనే పెట్రోలింగ్ పార్టీకి తెలియజేశారు. పెట్రోలింగ్ పార్టీ వారి వద్దకు చేరి అడ్డుకున్నారు. ప్రమాదకరమైన ఆయుధాలేమీ పట్టుకోకుండా.. ఆ స్మగ్లర్ల గుంపును వెనక్కి పంపడానికి బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయత్నించారు. కానీ, వారిని ఆపిన కొంత కాలంలోనే స్మగ్లర్లు జవాన్లపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు, పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. దీంతో ఓ జవాన్ తన వ్యక్తిగత ఆయుధాన్ని బయటకు తీసి వినియోగించాల్సి వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి.

స్వీయ ప్రాణ రక్షణలో భాగంగా జవాన్ వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ స్మగ్లర్‌కు బుల్లెట్లు దిగాయి. మిగతా వారూ అక్కడి నుంచి చీకట్లోకి జారుకుని పారిపోయారు. ఆ గ్రూపు నుంచి జవాన్లు 532 ఫెన్సెడైల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన స్మగ్లర్‌ను భారత పౌరుడు రోహిల్ మండల్‌గా గుర్తించారు. రోహిల్ మండల్ మున్షిరాబాద్‌కు చెందినవాడే కావడం గమనార్హం.

ఫెన్సెడైల్‌ను సాధారణంగా దగ్గు టానిక్‌గా వాడుతారు. కానీ, దీన్ని ఎక్కువ డోసుతో తీసుకుని డ్రగ్స్‌గా కూడా వాడతారు. ఎక్కువ డోసు తీసుకుంటే కిక్కు ఎక్కుతుందని కొందరు నిపుణులు చెప్పారు. గతంలో ఈ మందును బంగ్లాదేశ్ నిషేధించింది. దీంతో మన దేశ మార్కెట్‌లో లభించే ఈ ఫెన్సెడైల్ బంగ్లాదేశ్‌లో చాలా రెట్లు ఎక్కువ ధరకు స్మగ్లర్లు అమ్ముతుంటారని వివరిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్
గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?