కార్గో హోల్డ్‌లో పొగలు.. పాకిస్తాన్ లోని కరాచీలో దిగిన ఢిల్లీ-దోహ విమానం

Published : Mar 21, 2022, 11:35 AM IST
కార్గో హోల్డ్‌లో పొగలు.. పాకిస్తాన్ లోని కరాచీలో దిగిన ఢిల్లీ-దోహ విమానం

సారాంశం

ఢిల్లీ నుంచి దోహ వెళ్లాల్సిన ఓ విమానం.. సాంకేతిక కారణాల వల్ల అత్యవసరంగా పాకిస్తాన్ లోని కరాచీలో దిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమకు సిబ్బంది ఆహారం, నీళ్లు కూడా అందించలేదని ఆరోపించారు. 

న్యూఢిల్లీ : 100 మందికి పైగా ప్రయాణికులతో ఢిల్లీ (Delhi) నుంచి దోహ (Doha) వెళ్తున్న ఖతార్ ఎయిర్‌వేస్ (Qatar Airways) విమానం సాంకేతిక కారణాల వల్ల సోమవారం పాకిస్థాన్ (Pakistan)లోని కరాచీ (Karachi) విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ఈ ఘ‌ట‌నలో ఎవ‌రికి ఎలాంటి ప్ర‌మాదం జర‌గ‌లేదు. అయితే ప్రయాణికులను దోహాకు తీసుకెళ్లేందుకు మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ విమాన‌యాన సంస్థ తెలిపింది.

సోమవారం తెల్లవారుజామున 3.50 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం - QR579 ఉదయం 5.30 గంటలకు కరాచీలో దిగింది. దీంతో చాలా మంది ప్ర‌యాణికులు ఇబ్బంది ప‌డ్డారు. త‌మ‌కు ప్ర‌భుత్వం స‌హాయం చేయాల్సిందిగా డాక్టర్ సమీర్ గుప్తా (doctor Sameer Gupta) అనే ప్ర‌యాణికుడు ట్విట్ట‌ర్ లో వేడుకున్నాడు. ‘‘ QR579 - ఢిల్లీ - దోహా విమానాన్ని కరాచీకి తీసుకొచ్చారు. ఎందుకు ఇలా చేశారు అనే విష‌యంలో మాకు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు. ప్ర‌యాణీకుల‌కు ఆహారం, నీళ్లు అందించ‌లేదు. దయచేసి మాకు సహాయం చేయండి ’’ అంటూ ట్వీట్ చేశారు. 

 

మరో ప్రయాణికుడు రమేష్ రాలియా (Ramesh Raliya) విడుదల చేసిన వీడియోలో.. ‘‘ చాలా మందికి దోహా నుండి కనెక్టింగ్ విమానాలు ఉన్నాయి. అయితే కరాచీ నుండి విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందనే విషయంలో మాకు ఎలాంటి స‌మాచారం రాలేదు. సోమవారం తెల్లవారుజామున 3:50 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 5:30 గంటలకు కరాచీలో దిగింది. ల్యాండింగ్ తర్వాత అందరినీ విమానంలో నుంచి దిగి విమానాశ్రయంలో వేచి ఉండేలా చేశారు. ఇప్పుడు ఉదయం 9 గంటలైంది. ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో వారు మాకు చెప్పలేదు. అక్కడ మహిళలు, పిల్లలు ఉన్నారు ’’ అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

కార్గో హోల్డ్‌ (cargo hold)లో పొగలు కనిపించడంతో విమానాన్ని కరాచీకి మళ్లించామని, ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను దింపి, వారిని దోహాకు తరలించేందుకు రిలీఫ్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. ‘‘ మార్చి 21న ఢిల్లీ నుండి దోహాకు వెళ్లాల్సిన QR579 విమానం కార్గో హోల్డ్‌లో పొగలు కనపడడంతో ఎమర్జెన్సీని ప్రకటించి కరాచీకి మళ్లించారు. విమానం కరాచీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అక్కడ అత్యవసర సేవల ద్వారా ప్రయాణికులు కిందికి దిగారు ’’ ఆ సంస్థ ప్ర‌క‌టించింది. 

‘‘ ఈ ఘటన ప్రస్తుతం విచారణలో ఉంది. ప్రయాణీకులను దోహాకు తరలించడానికి రిలీఫ్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తున్నాం. మా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాము ’’ అని ఎయిర్ లైన్స్ పేర్కొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?