మమ్మల్నే బెదిరించారు: విపక్షంపై ఏడుగురు కేంద్రమంత్రుల ఆరోపణ

By telugu teamFirst Published Aug 12, 2021, 4:30 PM IST
Highlights

పార్లమెంటు సమావేశాలను అర్ధంతరంగా ముగించారని, మహిళా ఎంపీలపై మార్షల్స్ దాడి చేశారని ప్రతిపక్షాలు ఈ రోజు పార్లమెంటు నుంచి విజయ చౌక్‌కు ర్యాలీ తీశాయి. కొత్త బిల్లులు ప్రవేశపెడితే మరింత తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని విపక్ష ఎమ్మెల్యేలే తమను బెదిరించారని, అందుకే రెండు రోజులు ముందుగానే పార్లమెంటు సమావేశాలను ముగించాల్సి వచ్చిందని కేంద్ర మంత్రులు వివరించారు. సమావేశాలను అడ్డుకున్నందుకు ప్రతిపక్షాలే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. పార్లమెంటులోకి బయటివారెవరూ రాలేదని, అవన్నీ విపక్షాల నాటకాలనీ అపోజిషన్ నేతల ఆరోపణలను కొట్టిపారేశారు.

న్యూఢిల్లీ: పార్లమెంటులో వీరంగం సృష్టించిన విపక్షాలు దేశానికి క్షమాపణలు చెప్పాలని, ప్రతిపక్షాల నిర్వాకం వల్లే పార్లమెంటు సమావేశాలను రెండు రోజులు ముందుగా నిరవధిక వాయిదా వేయాల్సి వచ్చిందని ఏడుగురు కేంద్ర మంత్రులు అన్నారు. రాజ్య సభలో మార్షల్స్‌ తమపై దాడికి పాల్పడ్డారని, ఇది ప్రజాస్వామ్యాన్ని హత్యచేసినట్టేనని రాహుల్ గాంధీ సారథ్యంలో ఈ రోజు ఉదయం 15 పార్టీల ఎంపీలు నిరసనల చేసిన సంగతి తెలిసిందే. వారసలు మార్షల్స్ కాదని, బయటి వారినే సభలోకి అనుమతించారని, వారు మహిళా ఎంపీలపైనా దాడికి దిగారని ఆరోపించారు. ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ ఏడుగురు కేంద్రమంత్రులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఒక్కొక్కరు ప్రతిపక్షాల ఎంపీల తీరును ఎండగట్టారు.

దేశ ప్రయోజనాలకు, సంక్షేమ కార్యక్రమాల కోసం తమను ప్రజలు అధికారంలోకి పంపారని, కానీ, ప్రభుత్వ కార్యకలాపాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయని కేంద్రమంత్రులు ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాలకు భంగం కలిగించిన ప్రతిపక్షాలు దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రభుత్వం బిల్లులను పాస్ చేస్తే మరింత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని విపక్షాలు తమను బెదిరించాయని వెల్లడించారు. ఓబీసీ, ఇన్సూరెన్స్ బిల్లులను పాస్ చేసిన తర్వాత ఇతర బిల్లులేవైనా ప్రవేశపెడితే పార్లమెంటులో తీవ్రపరిణామాలు సృష్టిస్తామని హెచ్చరించాయని చెప్పారు. అందుకే రెండు రోజులు ముందుగానే వర్షాకాల సమావేశాలను ముగించాల్సి వచ్చిందని తెలిపారు.

ప్రతిపక్షాలు నాటకాలాడుతున్నాయని, నిజానికి పార్లమెంటులోకి బయటివారెవరూ రాలేదని జౌళీ శాఖ మంత్రి పియూశ్ గోయల్ అన్నారు. మొత్తం 30 మంది మార్షల్స్ ఉన్నారని, అందులో 18 మంది పురుష, 12 మంది మహిళా మార్షల్స్ ఉన్నారని వివరించారు. అంతేకాదు, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒకరు మహిళా మార్షల్ చేతి మెలితిప్పారని ఆరోపించారు. ఈ యావత్ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. దోషిగా తేలిన ఎంపీపై కఠిన చర్యలుంటాయని అన్నారు. దర్యాప్తులో తేలిన విషయాలన్నింటినీ ప్రజల
ముందుంచుతామని చెప్పారు.

చేసినదంతా చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాయని విపక్షాలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. వారు తప్పకుండా జాతిని క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు లేవనెత్తాలని ప్రజలు వారిని పార్లమెంటుకు పంపితే, వారు చేసేదంతా అరాజకమేనని ఆరోపించారు. గల్లీ మొదలు, పార్లమెంటు వరకూ అరాజకమే వారి అసలు ఎజెండా అని వివరించారు. ప్రజల సొమ్మును ఖాతరు చేయకుండా, వారి ప్రయోజనాలను పట్టించుకోకుండా పార్లమెంటు సమావేశాల్లో గందరగోళం చేశాయని మండిపడ్డారు. రాజ్యసభలో టేబుల్స్ డ్యాన్స్ చేయడానికి ఉన్నాయా? అని ఆగ్రహించారు.

click me!