
ఢిల్లీలో దారుణం జరిగింది. ఇద్దరు బాలురపై క్లాస్ మేట్స్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆరుగురు బాలురు కలిసి వారిద్దరిపై లైంగిక దాడికి ఒడిగట్టారు. ఇది ఓ గవర్నమెంట్ స్కూల్ లో చోటు చేసుకుంది. ఈ వేసవిలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ లో ఈ దారుణం చోటు చేసుకుందని బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వాయువ్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ లో ఇద్దరు బాలురపై క్లాస్ మేట్స్ లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు సోమవారం వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో స్కూల్ లో సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో 12,13 ఏళ్ల వయస్సు గల బాలురలను ఆరుగురు బాలురు బలవంతంగా సమీపంలోని పార్కుకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు.
దీంతో బాధితులు భయపడి ఈ దారుణాన్ని ఎవరికీ చెప్పలేదు. కాగా.. కొన్ని రోజుల క్రితం కూడా ఆ బాలురు బాధితులను ఇబ్బందులకు గురి చేశారు. దీంతో ఈ విషయాన్ని తన ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వారు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నిందితులందరూ మైనర్లే కావడంతో వారిని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరిచారు. ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు, స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. దీనిపై విచారణ జరిపేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ కమిటీని వేసింది.