కుమారుడి ఆపరేషన్ కోసం..లక్ష్యాన్ని మధ్యలోనే ఆపేసి..

By telugu news teamFirst Published Jan 4, 2021, 11:22 AM IST
Highlights

రెండేళ్ల క్రితం వారికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ బాలునికి పుట్టినప్పటి నుంచే గొంతు సమస్య ఉంది. ఫలితంగా ఆ బాలుడు మాట్లాడలేకపోయేవాడు. ఇలా సమస్యలు వెంటాడుతున్నప్పటికీ  ఫర్మానీ తన పాటలను రికార్డు చేసి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేది. 

కుమారుడి ఆపరేషన్ కోసం ఓ సింగర్ ఎవరూ చేయని త్యాగం చేసింది. తన లక్ష్యం కన్నా.. కుమారుడి ఆరోగ్యమే ముఖ్యమని భావించి.. పోటీల్లో నుంచి తప్పుకుంది. ప్రముఖ సంగీత పోటీ కార్యక్రమం ఇండియన్ ఐడల్‌లో పాల్గొంటున్న యూపీలోని ముజఫ్ఫర్‌నగర్‌కు చెందిన గాయని ఫర్మానీ నాజ్ తన కొడుకు కోసం పోటీల్లో నుంచి మధ్యలో నే నిష్క్రమించారు.

గాయనిగా సోషల్ మీడియాలో ఎంతో పేరు పొందిన ఫర్మానీ నాజ్ ఇండియన్ ఐడల్‌లో కాలుమోపి, మరింత గుర్తింపు పొందారు. అయితే ఇటీవలే ఆమె కుమారునికి మీరట్‌లోని ఒక ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. కుమారుణ్ణి దగ్గరుండి సంరక్షించుకునేందుకు ఆమె ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలేశారు. 

చిన్నప్పటి నుంచే సంగీతంపై అమితమైన ఇష్టం కలిగిన ఫర్మానీ స్కూలు చదివేటప్పుడే మంచి గాయనిగా పేరు తెచ్చుకున్నారు. ఆమెకు హసన్‌పూర్‌కు చెందిన మొహమ్మద్ ఇమ్రాన్‌తో వివాహమయ్యింది. రెండేళ్ల క్రితం వారికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ బాలునికి పుట్టినప్పటి నుంచే గొంతు సమస్య ఉంది. ఫలితంగా ఆ బాలుడు మాట్లాడలేకపోయేవాడు. ఇలా సమస్యలు వెంటాడుతున్నప్పటికీ  ఫర్మానీ తన పాటలను రికార్డు చేసి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేది. 

దీంతో ఆమె పాడే పాటలకు అత్యంత ఆదరణ దక్కింది. ఫలితంగా ఆమె సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. ఈ నేపధ్యంలోనే ఆమెకు ఇండియన్ ఐడల్‌లో పాడే అవకాశం దక్కింది. కార్యక్రమంలో పాల్గొంటుండగా, అనుకోని రీతిలో ఆమె కుమారుని గొంతు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. దీంతో ఆమె ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని మధ్యలోనే వదిలివేసి, కుమారుని సంరక్షణ కోసం వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు నిరాశకు గురైనప్పటికీ.. ఆమె కుమారుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. 

click me!