ప్రముఖ సింగర్ సిద్దూమూస్ వాలా తల్లిదండ్రులు బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. సిద్దూ సోదరుడు తమతో పాటు ఉన్నాడని ఆయన వెల్లడించారు.
దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలాకు సోదరుడు వచ్చాడు. ఆయన తల్లిదండ్రులైన బల్కౌర్ సింగ్, చరణ్ కౌర్ ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మూస్ వాలా తండ్రి తన అధికారిక ఫేస్ బుక్ పేజీల్లో ఈ విషయాన్ని షేర్ చేశారు. తమతో మూస్ వాలా తమ్ముడు ఉన్నాడని పేర్కొన్నారు.
‘‘శుభదీప్ ను (సిద్దూ మూస్ వాలా) ప్రేమించే కోట్లాది మంది ఆశీస్సులతో ఆ సర్వశక్తిమంతుడు శుభ్ తమ్ముడిని మా ఒడిలో ఉంచాడు. వాహెగురు ఆశీస్సులతో కుటుంబం ఆరోగ్యంగా ఉంది. అపారమైన ప్రేమకు శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు’’ అని బల్కౌర్ సింగ్ పేర్కొన్నారు.
58 ఏళ్ల వయసులో తన భార్య చరణ్ కౌర్ గర్భం దాల్చిందన్న వార్తలను బల్కౌర్ సింగ్ ఖండించారు. అలాంట వదంతులను నమ్మవద్దని కోరారు. ‘‘మా కుటుంబం గురించి ఆందోళన చెందుతున్న సిద్ధూ అభిమానులకు ధన్యవాదాలు. అయితే తమ కుటుంబం గురించి చాలా పుకార్లు వస్తున్నాయి. వాటిని నమ్మవద్దని వేడుకుంటున్నాం. ఏ వార్త అయినా మా కుటుంబం మీ అందరితో పంచుకుంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా.. పలు మీడియా కథనాల్లో వచ్చిన సమాచారం ఆధారంగా మూస్ వాలా తల్లి విట్రో ఫెర్టిలైజేషన్ థెరపీ (ఐవీఎఫ్) గర్భం దాల్చింది. ఇదిలా ఉండగా.. 2022 మే 29న మాన్సాలో సిద్దూ మూస్ వాలా హత్యకు గురయ్యాడు. అప్పుడు ఆయన వయస్సు 28 సంవత్సరాలు. ఆయన వాహనంలో ఉండగానే దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపారు. దీంతో డ్రైవర్ సీటులోనే అతడు కుప్పకూలిపోయాడు. అయినా దుండుగులు 30 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆయన మరణించాడు.
కాగా.. మూస్ వాలా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లా చేతిలో ఓడిపోయారు. అయితే మూస్ వాలా హత్యలో ప్రమేయం ఉన్న గ్యాంగ్ స్టర్ బిష్టోయ్ ను.. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిపేందుకు యువతను రిక్రూట్ చేసుకోవడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో ఎన్ ఐఏ అదే ఏడాది నవంబర్ 23న అరెస్టు చేసింది.