ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18, 21 తేదీల్లో వేర్వేరు కేసుల్లో విచారణకు రావాలని సమన్లు పంపారు.
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ నెల 18, 21 తేదీల్లో విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు ఈడీ అధికారులు. సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని అరవింద్ కేజ్రీవాల్ ను కోరారు ఈడీ అధికారులు.
ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. మార్చి 18న విచారణకు హాజరు కావాలని అరవింద్ కేజ్రీవాల్ కు శనివారం నాడు సమన్లు జారీ చేసినట్టుగా ఆప్ ప్రకటించింది.
ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసు గురించి తెలియదని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి ఆదివారంనాడు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.ఈ కేసును ఫేక్ కేసుగా అతిషి కొట్టిపారేశారు.
ఈ నకిలీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ అయ్యాయని అతిషి చెప్పారు. ఢిల్లీ జల్ బోర్డు విషయం ఎవరికీ తెలియదన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ వ్యవహరంలో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయలేరేమోననే అనుమానంతో జల్ బోర్డు కేసులో కేజ్రీవాల్ కు నోటీసులు పంపారని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు.అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికి బ్యాకప్ ప్లాన్ ప్రారంభించినట్టుగా అతిషి చెప్పారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని మరోసారి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఈ విషయాన్ని మంత్రి అతిష్ ధృవీకరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ కు ఎనిమిది దఫాలు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. అయితే ఈ విషయమై ఈడీ కోర్టును ఆశ్రయించింది.ఈ కేసులో కేజ్రీవాల్ నిన్న కోర్టుకు హాజరయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు శనివారం నాడు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారుల విచారణను కేజ్రీవాల్ తప్పించుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తుంది. ఈడీ విచారణను ఎదుర్కోవాలని కేజ్రీవాల్ కు బీజేపీ సూచించింది.చట్ట ప్రకారంగా ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ విచారణకు హాజరై సమాధానాలు చెప్పాలని బీజేపీ నేత హరీష్ ఖురానా కోరారు.
లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించిన కొన్ని గంటలకే ఢిల్లీ ముఖ్యమంత్రికి సమన్లు అందిన విషయాన్ని అతిషి గుర్తు చేశారు. తమ రాజకీ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొనేందుకు ఈడీ, సీబీఐ, బీజేపీలు ఉపయోగించుకుంటున్నాయని అతిషి ఆరోపించారు.2021-22కి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో కొంతమంది మద్యం డీలర్లకు ప్రయోజనం చేకూర్చినట్టుగా ఆరోపణలున్నాయి.ఈ విషయమై ఈడీ విచారణ చేస్తుంది.