
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తన కుమార్తెకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని శ్రద్ధావాకర్ తండ్రి ఢిల్లీలోని సిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది మే 18న శ్రద్ధాను ఆమెతో సహజీవనం చేస్తున్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా గొంతు కోసి చంపాడు. అనంతరం శ్రద్ధ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలో వున్న తన నివాసంలో దాదాపు మూడు వారాల పాటు ఫ్రిజ్‌లో వుంచాడు. పోలీసులకు దొరకకుండా ఆధారాలు మాయం చేసేందుకు గాను శ్రద్ధ శరీర భాగాలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 29న జరిగే విచారణ సందర్భంగా సమాధానం ఇస్తామని ఢిల్లీ పోలీసులు అదనపు సెషన్స్ జడ్జి మనీషా ఖురానా కక్కర్‌కు తెలియజేశారు.
శ్రద్ధా తండ్రి వికాస్ మదన్ వాకర్ తరపున న్యాయవాది సీమా కుష్వాహా ఈ పిటిషన్ దాఖలు చేశారు. హిందూ మత సంప్రదాయాల ప్రకారం చనిపోయిన వ్యక్తికి ఏడాదిలోగా అంత్యక్రియలు నిర్వహించాలని, హిందూ క్యాలెండర్ ఆధారంగా శ్రద్ధా వాకర్ దహన సంస్కారాలకు మే 8 చివరి తేదీ అని పిటిషన్‌లో కోర్టుకు తెలియజేశారు. ఇప్పటికే శ్రద్ధా వాకర్ మరణించి 10 నెలలకు పైగా గడిచిపోయిందని.. బాధితురాలి ఎముకలు, ఇతర శరీర భాగాలను ఆమె కుటుంబ సభ్యులకు అందజేయడానికి వీలుగా విచారణను వేగంగా నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అంతిమ సంస్కారాలు చేస్తే తప్పించి.. మరణించిన వారి ఆత్మ శాంతించదన్నది భారతదేశంలో అనాదిగా వస్తున్న విశ్వాసమని కోర్టుకు తెలిపారు. ఇది భారతీయుల భావోద్వేగంతో ముడిపడటంతో పాటు సెంటిమెంట్ కూడా అని పిటిషన్‌లో వెల్లడించారు. ఈ కారణాల చేత మరణించిన బాధితుడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేసే హక్కు కోల్పోకూడదని పిటిషన్‌లో తెలిపారు. అంత్యక్రియలు నిర్వహించడానికి అవకాశం కల్పించకపోవడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం మరణించిన వ్యక్తి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇదే సమయంలో 2009లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్‌లో ప్రస్తావించారు. దీని ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో ‘‘వ్యక్తి’’ అనే పదం చనిపోయిన వ్యక్తిని పరిమిత కోణంలో చేర్చింది. అతను గౌరవంగా జీవించే హక్కును పొడిగించాలని, దీని ప్రకారం ఆ వ్యక్తి మృతదేహానికి కూడా గౌరవం ఇవ్వబడుతుందని పిటిషన్‌లో తెలిపారు. ఆ వ్యక్తి జీవించి వున్నప్పుడు చెప్పుకునే సాంప్రదాయం, సంస్కృతి, మతానికి లోబడి వుండాలని.. బాధితురాలి పట్ల ఎలాంటి అగౌరవాన్ని ప్రదర్శించడానికి సమాజాన్ని అనుమతించకూడదని పేర్కొన్నారు.
గౌరవనీయమైన అంత్యక్రియలు హక్కును భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25లోనూ గుర్తించవచ్చని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇది మనస్సాక్షి స్వేచ్ఛ, స్వేచ్ఛా వృత్తి, అభ్యాసం, మత ప్రచారం, నైతికత, ఆరోగ్యం ఇతర ప్రాథమిక హక్కులకు లోబడి వుంటుందని తెలిపారు.