"ఉగ్రవాదులకు లొంగిపోదామా?": ప్రజలకు కాశ్మీర్ ప్రభుత్వ సూటి ప్రశ్న

By telugu teamFirst Published Oct 12, 2019, 6:25 AM IST
Highlights

అవే బెదిరింపులకు లొంగిపోదామా? మన వ్యాపారాలను మనమే స్తంభింపచేసుకుందామా? మన జీవనభృతిని మనమే నిలిపేసుకుందామా? మన పిల్లల విద్యకు మనమే ఆటంకం కలిగించడమంటే, వారి జీవితాన్ని మనమే చేజేతులా నాశనం చేసినట్టే అని ప్రభుత్వం ఆ ప్రకటనలో ప్రజలను చైతన్యపరిచింది. 

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని ప్రజలు స్వీయ నిర్బంధాన్ని వీడి బయటకు రావాలని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రప్రభుత్వం అక్కడి ప్రజలకు పిలుపునిచ్చింది. శుక్రవారంనాడు ఈ విషయమై అక్కడి అన్ని ప్రాంతీయ దినపత్రికల్లో ఒక ప్రకటనను జారీ చేసింది. 

ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత దశలవారీగా ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేస్తూ ప్రజలను బయటకు రావలిసిందిగా పిలుపునిస్తున్నా, పూర్తి స్థాయిలో బంద్ పాటించాలన్న ఉగ్రవాదుల బెదిరింపులకు ప్రజలు భయపడుతున్నారు. దీనితో తమకు తాము స్వీయ నిర్బంధం విధించుకొని ఇండ్లకే పరిమితమవుతున్నారు. 

ప్రజలెవ్వరూ వీధుల్లోకి రాకపోవడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలెవ్వరూ ఇలా వీధుల్లోకి రాకపోవడంతో, దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు కాశ్మీర్ విషయంలో భారతదేశంపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారు. ఈ నిర్మానుష్యమైన ప్రదేశాలను చూపిస్తూ, కాశ్మీర్ లో ఇంకా అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయని విషాన్ని కక్కుతున్నారు. 

ఇలాంటి విషప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని భావించిన ప్రభుత్వం స్పందించింది. ప్రజలందరూ  బయటకు రావాలని పిలుపునిచ్చింది. ప్రజలు ఇలా బయటకు రాకపోవడాన్ని అభివృద్ధికి ఆటంకంగా అభివర్ణిస్తూ ప్రభుత్వం ఈ ప్రకటన జారీ చేసింది. 

70 ఏళ్లుగా ప్రజలు మోసపోయారని, విషప్రచారానికి బలయ్యారని ఆ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. "ఉగ్రవాదులకు లొంగిపోదామా?" అంటూ ప్రజలను ప్రశ్నించింది. వేర్పాటువాదుల పిల్లలు విదేశాల్లో విద్యనభ్యసిస్తుంటే, ఇక్కడివారు మాత్రం పేదరికం, హింస, ఉగ్రవాదంలో కూరుకుపోయారని ప్రకటనలో పేర్కొన్నారు. 

ఇప్పటికీ, అదే ధోరణిని కొనసాగిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఇంకా అవే బెదిరింపులకు లొంగిపోదామా? మన వ్యాపారాలను మనమే స్తంభింపచేసుకుందామా? మన జీవనభృతిని మనమే నిలిపేసుకుందామా? మన పిల్లల విద్యకు మనమే ఆటంకం కలిగించడమంటే, వారి జీవితాన్ని మనమే చేజేతులా నాశనం చేసినట్టే అని ప్రభుత్వం ఆ ప్రకటనలో ప్రజలను చైతన్యపరిచింది. 

click me!