
ఉత్తర ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతానికి సమీపంలో ఓ గ్యాంగ్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇందులో ఆబిద్, అమన్, డిఫరాజ్‌లుగా బాధితులుగా పోలీసులు గుర్తించారు. వారి కాలు, తొడ వీపుపై గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగూరి బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షాహిద్ మోటారు విడిభాగాలను డెలివరీ చేస్తుంటాడు. రోజులాగేనే తన పని ముగించుకొని భార్యతో కలిసి బైక్ పై ఇంటికి తిరిగి ప్రయాణమయ్యాడు. తన ఇంటికి సమీపంలోకి వచ్చే సరికి ఎదురుగా వస్తున్న ఓ బైక్ ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. వీరి బైక్ షాహిద్ బైక్ ను తాకింది. దీంతో బైక్ కు చిన్న పాటి నష్టం జరిగింది. ఇది ఇరువురి మధ్య వాగ్వాదానికి దారితీసింది.తన బైక్ రిపేర్ చేయించి ఇవ్వాలని షాహిద్ ఇద్దరు వ్యక్తులను కోరారు.
ఇదే సమయంలో అంగూరి బాగ్ ప్రాంత స్థానికులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తులలో ఒకరు అతని సోదరుడికి ఫోన్ చేసాడు. అతను కొందరిని తీసుకుని అక్కడికి వచ్చాడు. వారందరినీ స్థానికులు పట్టుకున్నారు. అయితే అక్కడి నుండి తప్పించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు షాహిద్ వాహనాన్ని వెనకవైపు దూసుకెళ్లి వారి స్నేహితులతో కలిసి గన్ తో కాల్పులు జరిపారు. ఇలా ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో ఒకటి గాల్లో కాల్చగా.. మరో నాలుగు రౌండ్లు స్థానికులపైకి కాల్చారు. ఈ ఘటనలో షాహిద్ సోదరుడు అబిద్‌తో సహా ముగ్గురు వ్యక్తులకు బుల్లెట్‌లు తగిలాయి. వారందరినీ సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన అంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ ఫుటేజ్ లు నిందితులను గుర్తించేందుకు, ఘటన జరిగిన తీరును ఛేదించేందుకు సహాయపడిందని పోలీసులు తెలిపారు. నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్, ఆయుధాల చట్టం ప్రకారం హత్యాయత్నం (307) కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్) సాగర్ సింగ్ కల్సి తెలిపారు.