
ముంబయి: మహారాష్ట్రలో ప్రభుత్వం మారినా.. శివసేన పార్టీలోని రాజకీయాలు మాత్రం ఇంకా ఆసక్తికరంగానే సాగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రే మాట తప్పారు. ఎంపీలనైనా అదుపులో ఉంచుకోవాలని ఠాక్రే ముందుగా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా ఎంపీలతో సమావేశం అయ్యారు. 16 మంది శివసేన ఎంపీలు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సమావేశంలో పాల్గొన్నారు. వారంతా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు ఇవ్వాలని కోరారు. ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళ.. కాబట్టి, ఆమెకే ఓటు వేయాలని 16 మంది ఎంపీలు అంగీకరించినట్టు శివసేన ఎంపీ గజానన్ కీర్తికర్ వెల్లడించారు. మహారాష్ట్రలోనూ గిరిజన జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.
అయితే, ఎంపీలు ఎవరికి ఓటు వేయాలనే విషయమై ఇప్పటి వరకు అయితే విప్ జారీ చేయలేదు. ఈ సమావేశానికి హాజరైన 16 మంది ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రే విశ్వసనీయులు.
ఈ ప్రకటన కీలక మార్పును సూచిస్తున్నది. ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థికి మద్దతు ప్రకటించాలన్న ఉద్ధవ్ ఠాక్రే పార్టీ తన వైఖరిలో మార్పుకు శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తున్నది. అయితే, ఈ విషయమై మరో రెండు రోజుల్లో ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకోబోతున్నారు.
శివసేన పార్టీలో ఇంకా సంక్షోభం కొనసాగుతున్న తరుణంలో ఉద్ధవ్ ఠాక్రే ఈ సమావేశాన్ని నిర్వహించారు. శివసేన పార్టీకి లోక్‌సభలో 19 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. తాజాగా, ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన సమావేశానికి 16 మంది ఎంపీలు హాజరు అయ్యారు. వీరంతా ఉద్ధవ్ ఠాక్రేకు విశ్వసనీయులు. కాగా, డుమ్మా కొట్టిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఏక్ నాథ్ షిండే కొడుకు కూడా ఉండటం గమనార్హం.