ఉద్థవ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

By sivanagaprasad KodatiFirst Published Nov 26, 2019, 7:46 PM IST
Highlights

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే డిసెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే డిసెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంగళవారం సాయంత్రం ముంబై ట్రైడెంట్ హోటల్‌లో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల నేతృత్వంలో ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.

కూటమి నేతగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు కలిసి ఉద్ధవ్ థాక్రేను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

Also Read:మరోసారి ట్విట్టర్ బయోను మార్చిన అజిత్ పవార్

భారీ సంఖ్యలో విచ్చేసిన మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోటల్ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం మూడు పార్టీల కీలక నేతలు రాత్రి 8.30కి గవర్నర్‌ను కలవనున్నారు. 

కాగా డిప్యూటీ సీఎం పదవిని ఎన్సీపీ, కాంగ్రెస్‌లు చెరో రెండున్నరేళ్లు పంచుకోనున్నాయి. ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, కాంగ్రెస్ తరపున బాలాసాహెబ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. 

బుధవారం ఉదయం 8 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశాలు జారీ చేశారు. బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కాళిదాస్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించనున్నారు.

సాయంత్రం 5 గంటలకు ప్రొటెం స్పీకర్ బలపరీక్షను నిర్వహిస్తారు. ఇదే సమయంలో సాయంత్రం 5 గంటల్లోపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ‌ని కలిసిన ఫడ్నవీస్ రాజీనామా లేఖను సమర్పించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకే దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడం గమనార్హం. 

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం నాడు  మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రజలు మహాయుతికే పట్టం కట్టారని సీఎం ఫడ్నవీస్ చెప్పారు.బీజేపీ, శివసేనకు 70 శాతం ఓట్లు వచ్చాయన్నారు. శివసేన కంటే బీజేపీకే ఎక్కువ అసెంబ్లీ వచ్చాయని పడ్నవీస్ గుర్తు చేశారు.బలబలాలు చూసిన తర్వాత శివసేన బేరసారాలకు దిగిందన్నారు.

విడతల వారీగా సీఎం పదవి విషయంలో తాము శివసేనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని పడ్నవీస్ స్పస్టం చేశారు. తమతో పొత్తు కుదిరిన తర్వాత శివసేన తమను మోసం చేసిందని  ఆయన విమర్శించారు.

Also Read:రేపే మహారాష్ట్రలో బలపరీక్ష: అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్ ఆదేశం

ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా శివసేన వెళ్లిందని ఆయన చెప్పారు. సీఎం పదవిపై 50:50 ఫార్మూలాపై తాము శివసేనకు ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు.అబద్దాలాడుతూ ఇతర పార్టీలతో శివసేన  బేరసారాలు  చేసిందని ఫడ్నవీస్ ఆరోపించారు.

click me!