
న్యూఢిల్లీ: బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సినిమా ది కశ్మీర్ ఫైల్స్ ఈ నెల 11న విడుదలైనది మొదలు ఎన్నో చర్చలను లేవదీసింది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరిగింది. ఇంకా చర్చ జరుగుతూనే ఉన్నది. అధికార పార్టీలూ స్పందించాయి. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సినిమాను సమర్థించారు. అందరూ చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు. కొందరు ఈ సినిమాపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తాజాగా, ఈ సినిమాపై ఒకప్పటి బీజేపీ సోపతి, ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలోని శివసేన కామెంట్ చేసింది.
‘ది కశ్మీర్ ఫైల్స్’ కేవలం ఒక సినిమా మాత్రమే అని, అది రానున్న ఎన్నికల్లో ఎవరికీ ఎలాంటి ప్రయోజనాలను సమకూర్చి పెట్టబోదని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. కశ్మీర్ వంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. ది కశ్మీర్ ఫైల్స్ కేవలం ఒక సినిమా మాత్రమే అని అన్నారు. ఇది రానున్న ఎన్నికల్లో ఎవరికీ లబ్ది చేకూర్చి పెట్టబోదని వివరించారు. ఎన్నికలు వచ్చే సరికి ది కశ్మీర్ ఫైల్స్ సినిమా చుట్టూ రాజుకున్న వివాదం చల్లారిపోతుందని పేర్కొన్నారు.
ఈ సినిమాలో చూపెట్టిన విషయాలు వాస్తవాలేనా? అవాస్తవాలా? అనేది తర్వాత కూడా చర్చించుకోవచ్చని సంజయ్ రౌత్ అన్నారు. కానీ, ఈ సినిమాలో చూపించిన చాలా విషయాలను ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారని, అవి అవాస్తవాలని పేర్కొంటున్నారని వివరించారు. ఇంకా చాలా వాస్తవ విషయాలను సినిమాలో చూపెట్టాల్సిందని, కానీ, వాటికి చోటుకల్పించలేదని చాలా మంది అంటున్నారని తెలిపారు. 1990లో చోటుచేసుకున్న ఘటనల్లో ముస్లింలు కూడా మరణించారని వివరించారు. ఎంతో మంది అధికారులను ముస్లిం కుటుంబాలు కాపాడాయని తెలిపారు. కానీ, ఇలాంటి విషయాలను సినిమాలో చూపెట్టలేదని పేర్కొన్నారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అంతటితో ఆగలేదు. రానున్న రోజుల్లో ఈ సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని, సినిమా నిర్మాణం చేసిన వారికి పద్మ శ్రీ, పద్మ భూషణ్ వంటి అవార్డులూ వస్తాయని జోస్యం చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు వస్తూ ఉంటాయని తెలిపారు. ఇప్పటికే వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించారని (పరోక్షంగా సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని ప్రస్తావించారు) తెలిపారు. దీన్ని మనం ఇప్పటికే చూసి ఉన్నాం అని వివరించారు.
బీజేపీ పార్లమెంటరీ మీటింగ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ది కశ్మీర్ ఫైల్ సినిమాకు తన మద్దతు తెలిపారు. ఆ సినిమాపై కొందరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నారు. 1990లో కశ్మీర్ లోయను వదిలి అక్కడ హిందూ పండిట్ కుటుంబాలు వలసలు పోవాల్సిన దీన పరిస్థితులను సినిమాలో చిత్రీకరించారు.
ఈ సినిమాను ప్రోత్సహిస్తూ బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, త్రిపుర, గోవా, హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్‌లు ఈ సినిమాపై ట్యాక్స్ ఎత్తేస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ నేపథ్యలోనే ఝండ్ సినిమా నిర్మాతలు ప్రభుత్వాన్ని తమ చిత్రానికి ఎందుకు ట్యాక్స్ రద్దు చేయరని ప్రశ్నించారు. తమ సినిమాలోనూ సమాజంలోని అట్టడుగు వర్గాల గురించి చర్చించామని, వారి పురోగతికి పరిష్కారాలనూ సూచించామని వివరించారు.