
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. హాసన్ జిల్లాలోని అరసికెరె నియోజకవర్గం నుంచి జేడీఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కేఎం శివలింగె గౌడ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసనసభ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరిని కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. అరసికెరె నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అయిన శివలింగె గౌడ.. జేడీఎస్ నాయకత్వంతో విభేదాల గురించి గళం విప్పారు. ఆయన ఇటీవలి రోజుల్లో జేడీఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
జేడీఎస్ ఇప్పటికే అరసికెరె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా బాణవర అశోక్‌ను ప్రకటించినప్పటి నుంచి.. పార్టీ నాయకత్వంతో విభేదిస్తున్న శివలింగె గౌడ పార్టీని వీడాలని భావించారు. గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉన్న గౌడ కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన శివలింగె గౌడ.. కాంగ్రెస్‌లో చేరనున్నట్టుగా తెలిసింది. ఆయనను కాంగ్రెస్ పార్టీ అరసికెరె నుంచి పోటీకి దింపవచ్చని భావిస్తున్నారు.
ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ జేడీఎస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన మూడో జేడీఎస్ ఎమ్మెల్యేగా శివలింగె గౌడ నిలిచారు. జేడీఎస్‌కు చెందిన గుబ్బి ఎమ్మెల్యే ఎస్‌ఆర్ శ్రీనివాస్ (గుబ్బి శ్రీనివాస్ అలియాస్ వాసు) మార్చి 27న రాజీనామా చేసి గురువారం కాంగ్రెస్‌లో చేరగా.. అర్కలగూడ ఎమ్మెల్యే ఏటీ రామస్వామి శుక్రవారం శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.