సాయి భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి షిర్డీ నిరవధిక బంద్‌.. అసలేం జరుగుతోంది..?

Published : Apr 28, 2023, 01:47 PM IST
సాయి భక్తులకు అలర్ట్.. మే 1 నుంచి షిర్డీ నిరవధిక బంద్‌.. అసలేం జరుగుతోంది..?

సారాంశం

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రధాన మతపరమైన పర్యాటక కేంద్రమైన షిర్డీ ఆలయం దేశంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటనే సంగతి  తెలిసిందే. సాయిబాబా ఆలయాన్ని దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివెళ్తుంటారు.

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రధాన మతపరమైన పర్యాటక కేంద్రమైన షిర్డీ ఆలయం దేశంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటనే సంగతి  తెలిసిందే. అతి చిన్న గ్రామం అయిన షిర్డీలో ఉన్న సాయిబాబా ఆలయాన్ని దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివెళ్తుంటారు. అయితే సాయిబాబా భక్తులకు ప్రధాన సందర్శన కేంద్రంగా  ఉన్న షిర్డీ మే 1 నుంచి నిరవధికంగా మూతపడనుందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఇందుకు కారణం.. సాయిబాబా ఆలయం భద్రత విషయమై సాయి సంస్థాన్ ట్రస్ట్, షిర్డీ గ్రామస్తుల మధ్య నెలకొన్న వివాదమే. 

సాయి మందిరం భద్రత కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)ని మోహరించాలనే నిర్ణయానికి నిరసనగా  మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్ షిర్డీ వాసులు నిర్ణయం తీసుకున్నారు.  గ్రామస్తులు స్వయంగా బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారని..  అన్ని దుకాణాలు మూసివేయబడతాయని  తెలిపారు.  స్థానిక దుకాణాల యజమానుల సంఘం, రవాణాదారులు, వాణిజ్య సంస్థలు, ఆతిథ్య పరిశ్రమలోని ప్రజలు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. మతపరమైన పుణ్యక్షేత్రం ద్వారా ఎదురయ్యే ప్రత్యేక భద్రతా సవాళ్లను నిర్వహించడానికి సీఐఎస్ఎఫ్ శిక్షణ పొందలేదని వారు పేర్కొంటున్నారు.

షిర్డీ సాయిబాబా ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులు వస్తుంటారు. అన్ని వయసుల వారు, అన్ని మతాల వారు సాయిబాబాకు అంకితం చేయబడిన అతి ముఖ్యమైన ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయాన్ని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్‌ఎస్ఎస్‌టీ) నిర్వహిస్తుంది. ఇది షిర్డీ ఆలయ ప్రాంగణం నిర్వహణను పర్యవేక్షిస్తుంది. అలాగే ఉచిత భోజనం, పాఠశాలలు, కళాశాలల వంటి ధార్మిక సౌకర్యాలను కూడా నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటున్నారు. అయితే షిర్డీ వాసులు పిలుపునిచ్చిన బంద్‌తో ఎస్‌ఎస్ఎస్‌టీ‌కి ఎటువంటి సంబంధం లేదు. అయితే షిర్డీ ఆలయం భక్తుల కోసం తెరిచి ఉంటుందని  సంబంధిత వర్గాలు  చెబుతున్నాయి. 

ఇక, 2018లో నుంచి షిర్డీ విమానాశ్రయం భద్రత సీఐఎస్ఎఫ్ చూసుకుంటోంది. ఈ క్రమంలోనే షిర్డీ ఆలయంలో ప్రస్తుతం ఉన్న భద్రతా వ్యవస్థకు బదులుగా సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సామాజికవేత్త సంజయ్ కాలే ఆలయ భద్రతపై బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ఔరంగాబాద్ బెంచ్..భద్రత విషయమై సాయి సంస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా సీఐఎస్ ఎఫ్ భద్రతకు అంగీకారం తెలిపాయి. అయితే ఇక్కడే వివాదం రాజుకుంది. ఆ నిర్ణయాన్ని షిర్డీ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఐఎస్‌ఎఫ్ ప్రధానంగా పారిశ్రామిక సంస్థలు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలను రక్షించే దళం.. ఆలయ భద్రతను నిర్వహించడానికి అది సన్నద్ధం కాలేదని వారు పేర్కొన్నారు.  మే 1 నుంచి నిరవధిక బంద్‌కు నిర్ణయించామని.. తదుపరి కార్యచరణను అదే  రోజు సమావేశమై నిర్ణయిస్తామని చెబుతున్నారు. అయితే  సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీని వ్యతిరేకిస్తున్న షిర్డీ గ్రామస్తులు మరికొన్ని డిమాండ్లను  కూడా తెరమీదకు తీసుకువచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?