
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక సమీపించిన తరుణంలో ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి కసరత్తులు చేస్తున్నాయి. వరుసగా సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల ద్వారానే ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి బరిలోకి దించబోతున్నట్టు తెలుస్తున్నది. అంతేకాదు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక కాబోతున్నట్టు కూడా ఈ సమావేశాలు సూచిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ తమ మద్దతును శరద్ పవార్‌కే తెలిపినట్టు సంకేతాలు వస్తున్నాయి. రాజకీయవర్గాలు ఈ విషయాన్నే చెబుతున్నాయి. గత గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే.. శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పంపిన సందేశాన్ని శరద్ పవార్‌కు ఆ భేటీలో చేరవేసినట్టు భోగట్టా. వీరిద్దరూ ముంబయిలో సమావేశం అయిన సంగతి తెలిసిందే.
అయితే, కాంగ్రెస్ సూచనపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంకా స్పందించలేదని, గ్రీన్ సిగ్నల్ ఇంకా ఇవ్వలేదని కొన్ని వర్గాలు తెలిపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కూడా శరద్ పవార్‌కు ఆదివారం ఫోన్ చేశారు.
కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌లకూ ఫోన్ చేసి మాట్లాడారు. అంతేకాదు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ మాట్లాడారు. ఆమె ఏకంగా 25 మంది ప్రతిపక్ష నేతలతో ఢిల్లీలో సమావేశానికి పిలుపు ఇచ్చారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బుధవారం ఈ భేటీ నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికపై ఉమ్మడి వ్యూహాన్ని రచించనున్నారు.
ఇదే తరుణంలో బీజేపీ కూడా రంగంలోకి దిగింది.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఏకాభిప్రాయం తీసుకురావడానికి సంప్రదింపులు జరపాలని బీజేపీ పార్టీ నిర్ణయించుకుంది. ఈ బాధ్యతను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు పార్టీ అప్పగించింది. రాష్ట్రపతి అభ్యర్థిని మద్దతు తెలుపడానికి స్వతంత్ర ఎంపీలు, ఎన్‌డీఏ, యూపీఏ, యూపీఏయేతర పార్టీల నేతలనూ అంగీకరించేలా చర్చలు జరపాలని పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. వీరు త్వరలోనే సంప్రదింపులు మొదలు పెడతారని తెలిపింది.
రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 29వ తేదీ వరకు నామినేషన్ వేయవచ్చు. కాగా, ప్రెసిడెన్షియల్ ఎన్నికకు జూలై 18న పోలింగ్ జరుగుతుంది. ఈ ఓట్ల కౌంటింగ్ 21వ తేదీన ఉంటుంది.
రాష్ట్రపతిని ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఎన్నుకుంటారు. అంటే.. రాష్ట్రపతి ఎన్నికలో ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. అయితే, ఈ ఎన్నికలో నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓటు వేసే అర్హత ఉండదు.
రామ్‌నాథ్ కోవింద్ 2017లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.