
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం 600 వాహనాలతో షోలాపూర్ (మహారాష్ట్ర) చేరుకున్నారు.కేసీఆర్ కాన్వాయ్ లో తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులతో కూడిన భారీ సైన్యం కూడా ఉంది. కేసీఆర్ తన పర్యటన భాగంగా షోలాపూర్ సమీపంలోని పండర్‌పూర్ పట్టణంలోని విఠల్ స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం బిఆర్‌ఎస్ విస్తరణ ప్రయత్నాలలో భాగంగా సర్కోలి గ్రామంలో భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు. దీంతో పాటు ఉస్మానాబాద్‌లోని దేవి తుల్జా భవానీ ఆలయంలో పూజలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ ఈ కసరత్తు ప్రారంభించారు. బీఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా అవతరించేందుకు ఈ రెండు ఎన్నికలు దోహదపడతాయని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ మంగళవారం భారీ వాహన శ్రేణితో మహారాష్ట్రలోని పంఢర్‌పూర్ పట్టణానికి రావడం పట్ల ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ తనదైన శైలిలో స్సందించారు. బలాన్ని చూపించడానికి ఈ ప్రయత్నం ఆందోళనకరమని అన్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రార్థనలు చేయడానికి వస్తే, అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ వాహనాల సంఖ్య పరంగా బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం ఆందోళన కలిగించిందని అన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించి ఉంటే బాగుండేదని పవార్ అన్నారు. 2021 పంఢర్‌పూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఎన్‌సిపి టిక్కెట్‌పై పోటీ చేసి విఫలమైన భగీరథ్ భాల్కే మంగళవారం ర్యాలీలో బిఆర్‌ఎస్‌లో చేరడం గురించి అడిగిన ప్రశ్నకు.. ఒక వ్యక్తి పార్టీని విడిచిపెట్టినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవార్ అన్నారు. భగీరథ భాల్కేకు టికెట్ ఇచ్చిన తర్వాత మా ఎంపిక తప్పని గ్రహించామని, అయితే దాని గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నారు.