సీపీఎం కార్యాలయంలో ఎస్‌ఎఫ్ఐ కార్యకర్తపై అత్యాచారం

By Siva KodatiFirst Published Mar 24, 2019, 9:47 AM IST
Highlights

కేరళలో దారుణం జరిగింది. ఏకంగా అధికార సీపీఎం కార్యాలయంలో ఓ ఎస్ఎఫ్ఐ మహిళా కార్యకర్తపై అత్యాచారం జరిగింది.

కేరళలో దారుణం జరిగింది. ఏకంగా అధికార సీపీఎం కార్యాలయంలో ఓ ఎస్ఎఫ్ఐ మహిళా కార్యకర్తపై అత్యాచారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గతేడాది జూన్‌లో ఒక కాలేజీ మ్యాగజైన్‌ను రూపొందించే కార్యక్రమంలో భాగంగా 23 ఏళ్ల ఎస్ఎఫ్ఐ మహిళా కార్యకర్త చెరుప్లాసెర్రీలోని సీపీఎం పార్టీ కార్యాలయానికి వెళ్లింది.

అక్కడ ఓ విద్యార్ధి నాయకుడు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ను ఆమె చేత తాగించాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో గర్భం దాల్చిన ఆ యువతి ఈ ఏడాది మార్చి 16న ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

గత శనివారం రోడ్డు పక్కన ఆడ శిశువు కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ బిడ్డ తల్లి జాడ కనిపెట్టారు. దీంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి సమాచారం మేరకు నిందితుడిని చెరుప్లాస్సెర్రీకి చెందిన బైక్ మెకానిక్ ప్రకాశన్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం అతని రక్త నమూనాలను సేకరించి డీఎన్ఏ పరీక్ష కోసం తిరువనంతపురంలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మరోవైపు ఈ సంఘటనపై సీపీఎం నాయకుడొకరు స్పందించారు.

ఆ యువతి ఎస్ఎఫ్ఐ కార్యకర్త అని, ఆమె కుటుంబానికి సీపీఎంతో సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. పార్టీ ఆఫీసులో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పార్టీ దర్యాప్తు జరుపుతుందని, పోలీసులు కూడా శాస్త్రీయమైన దర్యాప్తు జరపాలన్నారు. 

click me!