
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం గాలిలో ఉన్న సమయంలో భారీ కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలయ్యాయి. మంగళవారం రోజున ఎయిర్ ఇండియా విమానం న్యూఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ఎయిర్ ఇండియా B787-800 విమానం మంగళవారం ఢిల్లీ నుంచి సిడ్నీకి బయలుదేరింది. అయితే మార్గమధ్యలో గాలిలో ఉండగానే కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారి తెలిపారు. ఏడుగురికి స్వల్ప గాయాలైనట్టుగా చెప్పారు. విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్, నర్సు సహాయంతో క్యాబిన్ సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించారని పేర్కొన్నారు. విమానం ల్యాండ్ అవ్వగానే.. సిడ్నీలోని ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ మేనేజర్ వైద్య సహాయాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ముగ్గురు ప్రయాణికులు మాత్రమే వైద్య సహాయం తీసుకున్నారని చెప్పారు.
అయితే ప్రయాణికులెవరినీ కూడా ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం రాలేదని తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.