గుడికి వెళ్తుండగా ప్రమాదం.. ట్రాక్టర్ చెరువులో పడి 10 మంది మృతి..

By Sumanth KanukulaFirst Published Sep 26, 2022, 4:53 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడిపోవడంతో.. 10 మంది మృతిచెందారు.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో పడిపోవడంతో.. 10 మంది మృతిచెందారు. బాధితులను  సీతాపూర్‌లోని అట్టారియా నివాసితులుగా గుర్తించారు. బాధితులుఇటౌంజలోని ఉన్నై దేవి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా  ప్రమాదం జరిగింది. వివరాలు.. నవరాత్రి ఉత్సవాల తొలిరోజు  చిన్నారికి పుట్టువెంట్రుకలు తీయించేందుకు అట్టారియాకు చెందిన ఓ కుటుంబం ఉన్నై దేవి ఆలయానికి ట్రాక్టర్‌లో బయలుదేరింది. ట్రాక్టర్‌లో చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు కలిపి మొత్తం 47 మంది ఉన్నారు. 

వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ లక్నో శివార్లలోని ఇటౌంజా ప్రాంతంలో.. ప్రధాన రహదారిపై నుంచి జారి చెరువులో పడిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. చెరువు దగ్గరకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం చెరవేశారు. మొత్తంగా 37 మందిని రక్షించారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో జరిగిన ప్రాణనష్టంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌, పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ. లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
 

click me!