
అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనే కలతో అక్కడికి వెళ్లిన కొందరు భారతీయ విద్యార్థులకు భారీ షాక్ తగిలింది. అమెరికాలో చదువు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడ ల్యాండ్ అయిన.. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. అయితే వారు వీసా ప్రక్రియలను పూర్తి చేసినప్పటికీ, విశ్వవిద్యాలయాల నుండి అడ్మిషన్లు పొందినప్పటికీ.. చాలా మంది విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ తనిఖీల తర్వాత వెంటనే వెనక్కి పంపబడ్డారు.
అమెరికాలోని అట్లాంట, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగోలలోని యూనివర్సిటీల్లో చదివేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఈ చేదు అనుభవం ఎదురైంది. అయితే సరైన పత్రాలు లేకపోవడంతోనే వారిని వెనక్కి పంపినట్టుగా తెలుస్తోంది. మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ చూసిన తర్వాత వారిని తిప్పి పంపినట్టుగా చెబుతున్నారు. ఇక, భారత్‌కు తిప్పి పంపిన 21 మంది విద్యార్థులు ఐదేళ్లపాటు పాటు అమెరికాలోకి రాకుండా వారిపై ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది.
ఈ పరిణామాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా తమను ఎందుకు తిప్పిపంపతున్నారో అంటూ విద్యార్ధుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత విదేశాంగ శాఖ అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ పరిణామాలతో భారత్ నుంచి అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థుల్లో సైతం ఆందోళన నెలకొంది.