నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ సహా ఎనిమిది మంది ముఖ్యమంత్రులు డుమ్మా

By Mahesh KFirst Published May 27, 2023, 1:06 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మన్, తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌లు డుమ్మా కొట్టారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఈ సమావేశానికి అటెండ్ కాలేదు.
 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ అధ్యక్షతనలో ఈ రోజు ఢిల్లీలో నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశానికి ఏడుగురు ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోగ్య సమస్యలను కారణంగా చెప్పి సమావేశానికి రావడం లేదని స్పష్టం చేశారు. కాగా, కేరళ సీఎం పినరయి విజయన్ ఎలాంటి కారణాలు చెప్పకుండానే మీటింగ్‌కు గైర్హాజరయ్యారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఏకంగా ఈ సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రధానికి ఓ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పును పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను‌ వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం దేశ సమాఖ్య సహకార వ్యవస్థను ఒక జోక్‌గా మార్చేసిందని మండిపడ్డారు. 

పంజాబ్ సీఎం భగవంత్ మన్ కూడా కేంద్రానికి ఓ లేఖ రాశారు. పంజాబ్ ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. రూరల్ డెవలప్‌మెంట్ ఫండ్, పంట వ్యర్థాల దహనం, రైతుల సమస్యలను ఈ సమావేశంలో తాము గతంలో లేవనెత్తామని, కానీ, కేంద్రం వీటిపై ఉదాసీనంగా వ్యవహరించి ఇప్పటికీ స్పందించలేదని ఆరోపణలు చేశారు. ఆ ప్రయోజనాలపై దృష్టి పెట్టే వరకు ఈ సమావేశానికి హాజరు కావడం దండగ అని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశం కేవలం ఒక ఫొటో సెషన్‌గా మారిపోయిందని తెలిపారు.

Also Read: సమోసా కోసం ఈ అమెరికన్ యూట్యూబర్ ఏం చేశాడో తెలుసా?

మరో ఇద్దరు ప్రతిపక్ష నేతలు.. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌లు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. వీరంతా ప్రతిపక్ష కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కూటమి కోసం ప్రయత్నిస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్ నుంచి సమదూరం పాటించే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరయ్యారు.

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలను బాయ్‌కాట్ చేయడం అంటే.. ఆయా ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాల అభివృద్ధిని కుంటుపట్టించడమే అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వందకు మించి ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతున్నదని తెలిపాయి. ఈ సమావేశంలో ప్రాతినిధ్యం వహించని రాష్ట్రాలు నష్టపోతాయని చెప్పాయి.

click me!