ప్రధాన మోడీ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించింది. కేరళకు చెందిన జ్ఞానేశ్వర్ కుమార్, పంజాబ్‌కు చెందిన సుఖ్‌బిర్ సింగ్ సంధులను నియమించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎంపిక కమిటీ ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించింది. ఈ ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్‌లే కావడం గమనార్హం. కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్ కుమార్, ఉత్తరాఖండ్ క్యాడర్.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుఖ్‌బిర్ సింగ్ సంధులను ఈ సెలెక్షన్ కమిటీ కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా నియమించింది.
ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. అధిర్ రంజన్ చౌదరి కూడా సెలెక్షన్ కమిటీలో ఉన్నారు. ప్రధానమంత్రి సారథ్యంలోని ఈ సెలెక్షన్ కమిటీలో కేంద్ర మంత్రి, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎంపీ సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ ఎన్నికల కమిషనర్లను నియమిస్తుంది.
గతంలో ఈ సెలక్షన్ కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు. కానీ, ఈ మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదంతో చట్ట సవరణ చేసింది. ఈ సవరణ తర్వాత ఏర్పడ్డ తొలి సెలెక్షన్ కమిటీ ఇదే.
ఎన్నికల కమిషనర్ అనూప్ పాండే ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు. కాగా, అరుణ్ గోయల్ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ రాజీనామా చేశారు. ఆయన పదవీ విరమణతో కేంద్ర ఎన్నికల సంఘలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. సాధారణంగా ఈ కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడ్డ సందర్భంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో సెలెక్షన్ కమిటీ వేగంగా ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించింది.