దళిత బాలిక చేయి విరగ్గొట్టిన టీచర్.. ఫిర్యాదు చేసేందుకు స్కూల్‌కు వెళ్లిన తల్లిదండ్రులపై బెదిరింపులు..

By Sumanth KanukulaFirst Published Sep 7, 2022, 9:36 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఉన్నత కులానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు దళిత విద్యార్థిని చేయి విరగ్గొట్టాడు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి స్కూల్ వద్దకు వచ్చిన విద్యార్థిని తల్లిదండ్రులను దూషించాడు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఉన్నత కులానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు దళిత విద్యార్థిని చేయి విరగ్గొట్టాడు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి స్కూల్ వద్దకు వచ్చిన విద్యార్థిని తల్లిదండ్రులను దూషించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన లాభం లేకుండా పోయింది. చివరకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆదేశ్ కుమార్ సాగర్ ఆదేశాల మేరకు పచోఖరా పోలీస్ స్టేషన్‌లో ఐపీసీలోని 323, 325, 504 సెక్షన్‌లతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. 

వివరాలు.. నిందితుడు గుడ్డు పండిట్ సేలంపూర్‌లో ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే గుడ్డు పండిట్.. ఆగస్టు 31న స్కూల్‌లో దళిత విద్యార్థిని చేయి విరగ్గొట్టాడు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాలిక తల్లిదండ్రులపై అతడు దూషించాడు. అంతేకాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు.

ఈ ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థిని తండ్రి సునీల్ కుమార్ మాట్లాడుతూ..“నా బిడ్డను దారుణంగా కొట్టడంపై ఫిర్యాదు చేయడానికి నేను, నా భార్య పాఠశాలకు వెళ్లాం. అప్పుడు నిందితుడు మమ్మల్ని దుర్భాషలాడటం ప్రారంభించాడు. ఇతరుల ముందు మాపై కుల దురభిమానం ప్రదర్శించాడు. అతను బెదిరింపులకు పాల్పడ్డాడు. మమ్మల్ని అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పాడు. ఇందుకు సంబంధించి నేను రోజుల తరబడి స్థానిక పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగాను. కానీ వాళ్లు ఎటువంటి చర్య తీసుకోలేదు. చివరకు నేను మంగళవారం సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నా కూతురు గాయపడింది. ఆమె సరిగా ఆహారం కూడా తీసుకోవడం లేదు’’ అని చెప్పారు. 

సునీల్ కుమార్ ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడిపై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని డిప్యూటీ ఎస్పీ హరిమోహన్ సింగ్ చెప్పారు. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. నిందితుడిని విచారణకు పిలిచామని.. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్టుగా చెప్పారు. 
 

click me!