మాజీ ప్రధాన న్యాయమూర్తిని రాజ్యసభకు నామినేట్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

By Rajesh KarampooriFirst Published Nov 9, 2022, 7:50 PM IST
Highlights

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ని రాజ్యసభకు నామినేట్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ప్రముఖ న్యాయవాది సతీష్ ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్. ఓకా బెంచ్  కొట్టివేసింది.

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ రాజ్యసభకు నామినేట్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్,జస్టిస్ అభయ్ ఎస్.ఓకా బెంచ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ..ఇది ప్రచార ప్రయోజన వ్యాజ్యమని పేర్కొంది. మాజీ ప్రధాన న్యాయమూర్తిని రాజ్యసభకు నామినేట్ అయ్యే అర్హత లేదని ప్రముఖ న్యాయవాది సతీష్ ఎస్ పిటిషన్ దాఖాలు చేశారు.   

ధర్మాసనం ఏమి చెప్పింది

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్,జస్టిస్ అభయ్ ఎస్.ఓకా ల ధర్మాసనం.. ఈ పిటిషన్ ను విచారిస్తూ.. అర్హత అనేది ఎవరు నిర్ణయిస్తారో తెలియదా అని ప్రశ్నించింది. అసలు ఈ పిటిషన్‌ను విచారించడానికి సరైన కారణం లేదని తోసిపుచ్చింది. అదే సమయంలో తాము ఎలాంటి జరిమానా విధించకపోవడం పిటిషన్ దారు అదృష్టమని పేర్కొంది. 

అంతకుముందు అర్హత ప్రమాణాల అంశంపై పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఆ సమయంలో జస్టిస్ కౌల్ జోక్యం చేసుకుంటూ " అసలు అర్హతను ఎవరు నిర్ణయిస్తారని ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం దాఖాలు చేసిన పిటిషన్‌ అని అనిపిస్తోందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80ని ఉదహరిస్తూ న్యాయవాది తన అభిప్రాయాన్ని సమర్థించుకుంటున్నారు. వెంటనే జస్టిస్ కౌల్ మాట్లాడుతూ.. మీకు ఎటువంటి జరిమానా విధించనందుకు సంతోషించాలని అన్నారు.

అలాగే.. భారత అధికారిక గెజిట్‌లో నోటిఫై చేయబడినట్లుగా గొగోయ్ నామినేషన్‌కు సంబంధించి నోటిఫికేషన్‌ను కోరుతూ అజం ఖాన్ చేసిన పిటిషన్‌పై రేపు నిర్ణయం తీసుకోవాలని సెషన్స్ కోర్టును ఆదేశించింది. భారతదేశ అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన నోటిఫికేషన్ ద్వారా 16 మార్చి 2020న ఆయనను భారత రాష్ట్రపతి నామినేట్ చేశారు.
 
సున్నితమైన అయోధ్య వివాదంతో సహా పలు ముఖ్యమైన నిర్ణయాలను వెలువరించిన బెంచ్‌లకు అధ్యక్షత వహించిన జస్టిస్ రంజన్ గొగోయ్‌ను ప్రభుత్వం మార్చి 16, 2020న రాజ్యసభకు నామినేట్ చేసింది. అదే రోజు ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. ఆయన 46వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. నవంబర్ 17, 2019న పదవీ విరమణ చేశారు.

ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన తొలి మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆయనే. ఆయనకు ముందు..మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేశారు.

click me!