
సజ్నా అలీ దగ్గర ఒక మంచి గుణం ఉన్నది. తాను ఇష్టపడ్డ పనిని చేసి తీరుతుంది. ఆమె ప్రయాణం 2014లో ప్రారంభమైంది. కేరళ రాజధాి తిరువనంతపురం నుంచి ఒడిశాకు వీకెండ్ ట్రిప్ వేయాలని ఫ్రెండ్స్ ప్లాన్ వేసుకున్నారు. అది సాధ్యం కాలేదు. కానీ, ఆమె ఆగలేదు. ఒంటరిగా ట్రిప్ వేసి వచ్చింది. పర్యటన అంటే ప్రాణం. అందుకే తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి టూరిజం కేంద్రంగా కంపెనీ ప్రారంభించింది. ఒంటరిగా ట్రావెల్ చేసే మహిళలకు సహకరిస్తూ ముందుకు సాగుతున్నది.
ఆమె ట్రావెల్ ఏజెన్సీ పేరు అప్పూప్పంతాడి. ఈ జూన్‌తో అప్పూప్పంతాడి తన 398 ట్రిప్ పూర్తి చేసుకుంది.
36 ఏళ్ల సజ్నా రెండు నెలల పాపకు తల్లి. ఆమె ఎనిమిది సంవత్సరాల కింద తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు 4,300 మంది మహిళలు దేశవ్యాప్తంగా పర్యటించారు. త్వరలోనే ఆమె ఫస్ట్ అంతర్జాతీయ ట్రిప్ కూడా కార్యరూపం దాల్చనుంది.
‘నేను నా ట్రిప్‌లోని ఆసక్తికరమైన, హాస్యభరితమైన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాను. చాలా మంది వాటి గురించి ఆరా తీసేవారు. అప్పుడే అనిపించింది. ట్రావెల్ ఏజెన్సీ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అని అనుకున్నాను.’ అని సజ్నా గుర్తుచేసుకుంది.
‘నేను కోళికోడ్‌లో పెరిగాను. నాన్న ట్రక్ డ్రైవర్. ఆయన ప్రతి ట్రిప్ నుంచి కొన్ని ఫొటోలు తీసుకువచ్చి చూపించేవాడు. ఆయనతోపాటు లాంగ్ ట్రిప్‌లకు తీసుకెళ్లాలని డిమాండ్ చేసేదాన్ని. కానీ, మహిళలకు వసతులు ఉండవనే కారణంతో తిరస్కరించేవాడు. అయితే, వన్ డే ట్రిప్‌లకైతే వెంట తీసుకెళ్లేవాడు. నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని’ అని వివరించింది.
ఇప్పుడు ఆమె ట్రావెల్ ఏజెన్సీ కేరళ ప్రభుత్వ టూరిజం మిషన్‌తో టై అప్ అయింది. దీని ద్వారా వారి కంపెనీ ఇద్దరు ఔత్సాహికులకు ప్రయాణ అవకాశం కల్పించి పర్యాటక ప్రాంతాల గురించి బ్లాగ్‌లు, వీడియోలు ఆన్‌లైన్‌లో పోస్టు చేసి టూరిజం పుంజుకోవడానికి దోహపడుతుంది.
ఆమె ట్రావెల్ ఏజెన్సీ మెయిన్ సోర్స్ సోషల్ మీడియానే. 11,000 మందితో ఫేస్‌బుక్ గ్రూప్‌లు నడుపుతున్నది. 300 మంది సభ్యులుండే గ్రూపులు 22 ఉన్నాయని, వాటికి ఆమెనే అడ్మిన్.
Also Read: విజయవాడ ఇప్తార్ విందు: పాల్గొన్న సీఎం జగన్ (ఫోటోలు)
ఒంటరిగా మహిళ ప్రయాణించడం అంటే కేవలం సుందరమైన ప్రదేశాలు వీక్షించడం, సెల్ఫీలు తీసుకోవడం కాదని, అది మహిళా సాధికారతకు సంబంధించినదని సజ్నా చెబుతుంది. సోలో ట్రావెలింగ్ అనేది ఎంపావరింగ్ అని చెబుతుంది. ప్రయాణం ద్వారా తమను తాము విముక్తి కల్పించుకున్న అనుభూతి చెందిన మహిళలను తాను చూశానని వివరించింది.
మహిళ భద్రత తమ ప్రథమ బాధ్యత అని సజ్నా అలీ తెలిపింది. హోటల్ కారిడార్‌లో లైట్స్ ఉన్నాయా? లేదా? అని చెక్ చేయడం, స్పేర్ బ్యాటరీ టార్చ్‌లు, సేఫ్టీ యాప్‌లు, పెప్పర్ స్ప్రే, టేజర్ల వంటి స్వీయరక్షణ పరికరాలను పంపుతామని వివరించింది.
(ఈ స్టోరీని సిరాజ్ అలీ ఖాద్రీ రిపోర్ట్ చేశారు. ఆవాజ్ ది వాయిస్ పబ్లిష్ చేసింది.)