భావి తరాల కోసం పుడమిని కాపాడుకుందాం.. సద్గురు రిపబ్లిక్ డే సందేశం

By Mahesh KFirst Published Jan 26, 2022, 3:40 PM IST
Highlights

సద్గురు జగ్గీ వాసుదేవ్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన సందేశాన్ని విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా భూమి తీవ్రంగా దెబ్బతింటున్నదని, ఈ పుడమిని కాపాడుకోవడానికి అందరూ సమాయత్తం కావాలని కోరారు. ఇందుకోసం మార్చిలో సేవ్ సాయిల్ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. అందరూ ఈ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొని  దేశం, ఇతర దేశాల్లోనూ అవగాహన కలిగించాలని కోరారు. 

న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ (Isha Foundation) వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) గణంతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా ప్రజలకు తన సందేశాన్ని (Message) ఇచ్చారు. ఈ భూమిని ఒక ప్రాణమున్న జీవిగా భావించాలని, దాన్ని అలాగే జీవించనివ్వాలని పేర్కొన్నారు. తద్వారా ఇదే ధరిత్రిని భావి తరాలకు సురక్షితంగా అందజేసినవారం అవుతామని వివరించారు. ఇది నేడు జీవించి ఉన్న ప్రస్తుత తరం బాధ్యత అని తెలిపారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంవత్సరంలో నిర్వహించుకుంటున్న ఈ గణతంత్ర దినోత్సవాలు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనవేనని వివరించారు. ఈ గణతంత్ర వేడుకల సందర్భంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ ప్రకటనలో తన సందేశాన్ని విడుదల చేశారు. పుడమిని కాపాడుకుందాం(సేవ్ సాయిల్) అనే ఉద్యమాన్ని ఈ ఏడాది మార్చిలో ప్రారంభించబోతున్నాడు.

భారత్‌కు ప్రత్యేక బలాలు ఉన్నాయని సద్గురు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భారత దేశం ఒక యువ ప్రజాస్వామిక దేశం అని, నాగరికత పరంగా అతి పురాతనమైదని వివరించారు. ఈ భారత యువ శక్తినే వాస్తవ ప్రపంచంలో యాక్షన్‌గా మార్పు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. అదే సమయంలో భారతీయ యువత, ప్రతి భారతీయ పౌరుడు పుడమిని కాపాడాలని (Save Soil) చేసే అంతర్జాతీయ ఉద్యమంలో పాలుపంచుకోవాలని కోరారు. ఈ ఉద్యమాన్ని ఆయన మార్చిలో ప్రారంభించబోతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా భూమి పొరలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని సద్గరు చెప్పారు. ఈ నష్టంతో అనేక జీవరాశులు వేగంగా అంతరించిపోయే ముప్పు ఉన్నదని తెలిపారు. ఆహారం, నీటి వనరులపైనా తీవ్ర దుష్ప్రభావాన్ని వేస్తాయని వివరించారు. అంతేకాదు, పర్యావరణ సంబంధం ఉపద్రవాలు ఏర్పడవచ్చని తెలిపారు.

ఈ భూమి అంటే ఏవో కొన్ని రసాయనాల సమ్మేళనం అని పొరబడకండి అంటూ హెచ్చరించారు. ఇదొక ప్రాణమున్న జీవి అని పేర్కొన్నారు. బయోడైవర్సిటీ చాలా ముఖ్యమని చెప్పారు. భూమిపై గల 12 నుంచి 15 అంగుళాల పొరనే మానవాళి మనుగడ సాధించడానికి బేస్‌గా ఉన్నదని తెలిపారు. మానవులు వారి జీవించి ఉండటానికి గల మౌలిక అంశాలతో అనుసంధానంలో ఉండకపోతే వారికి జీవితం తీరును, సృష్టికి వనరులుగా ఉన్నవాటి గురించిన అవగాహన కల్పించలేమని వివరించారు. 

అందుకే ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకోవాలని కోరుతున్నట్టు సద్గురు వివరించారు. ఈ ఉద్యమాన్ని మీదిగా భావించి ముందుకు తీసుకెళ్లండని తెలిపారు. మన దేశంలో దీనిపై అవగాహన కలిగించండని కోరారు. ఆ తర్వాత ప్రపంచం నలుమూలలకు వ్యాపింపజేయండని వివరించారు. 192 దేశాల్లో భూమి దెబ్బతినకుండా పాలసీలను రూపొందించడానికి ఈ ఉద్యమం ఒత్తిడి తెస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మందిలో ఈ ఉద్యమం మార్పు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నదని వివరించారు. తమ తమ దేశాల్లో వీరు ఓట్ల ద్వారా సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు కలిగి ఉంటారని, ఆ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. జగ్గీ వాసుదేవ్‌కు భారత్‌లో ప్రత్యేక అభిమానులు, భక్తులు ఉన్న సంగతి తెలిసిందే.

click me!