యూపీలో అనుమ‌తి లేకుండా మతపరమైన ఊరేగింపులు నిషేధం - యోగి ఆదిత్యనాథ్

Published : Apr 19, 2022, 03:30 PM IST
యూపీలో అనుమ‌తి లేకుండా మతపరమైన ఊరేగింపులు నిషేధం - యోగి ఆదిత్యనాథ్

సారాంశం

ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. అనుమతి లేకుండా ఎలాంటి మతపరమైన ర్యాలీలూ చేపట్టకూడదని తేల్చి చెప్పింది. ఊరేగింపులు నిర్వహించాలనుకునే వారు ఏవైనా ఘటనలు జరిగితే తామే పూర్తి స్థాయి బాధ్యత వహిస్తామని అఫిడివిట్ అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. 

దేశంలోని ప‌లుప్రాంతాల్లో మతపరమైన హింసాత్మక ఘటనలపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తగిన అనుమతి లేకుండా రాష్ట్రంలో ఎలాంటి మతపరమైన ఊరేగింపులూ లేదా కవాతులు చేయ‌కూడ‌ద‌ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. లౌడ్ స్పీకర్ల వినియోగం వల్ల ఇతరులకు అసౌకర్యం కలగకూడదని అన్నారు. శాంతిభద్రతలపై ఉన్నతాధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 

ఈద్, అక్షయ తృతీయ పండుగ వచ్చే నెలలో ఒకే రోజున వచ్చే అవకాశం ఉన్నాయి. త‌రువాత కూడా అనేక పండ‌గ‌లు రానున్నాయి. ఈ సంద‌ర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికి తన మత సిద్ధాంతాల ప్రకారం పూజా విధానాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉందని అన్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం ఆదేశించారు. 

ఈ పండ‌గ‌ల‌కు అనుమతి ఇచ్చే ముందు శాంతి, సామరస్యాలను పరిరక్షిస్తామంటూ నిర్వాహకులందరూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని యోగి ఆదిత్య‌నాథ్ చెప్పారు. ఈ మేరకు ఆయ‌న మంగ‌ళ‌వారం ట్వీటో చేశారు. ‘‘ తమ అనుమతి లేకుండా మతపరమైన ఊరేగింపులు జరపకూడదు. అనుమతి ఇచ్చే ముందు, శాంతి, సామరస్య పరిరక్షణకు సంబంధించి నిర్వాహకుడి నుండి అఫిడవిట్ తీసుకోవాలి. సాంప్రదాయకంగా జరిగే మతపరమైన ఊరేగింపులకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. కొత్త కార్యక్రమాలు చేయకూడదు. ’’ అని ఆయ‌న పేర్కొన్నారు. 

మైక్‌లు వాడవచ్చు గానీ, ఆ ప్రాంగణంలో నుంచి సౌండ్ బ‌య‌ట‌కు రాకుండా చూసుకోవాల‌ని అన్నారు. ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, కొత్త ప్ర‌దేశాల్లో లౌడ్ స్పీకర్‌లు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వరాదని సూచించారు. మతపరమైన కార్యక్రమాలు, ఆరాధనలను నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే నిర్వహించాల‌ని చెప్పారు. రోడ్లు లేదా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ఎలాంటి మ‌త‌ప‌ర‌మైన కార్యక్రమాలూ జరగకుండా చూసుకోవాల‌ని చెప్పారు.

ఇటీవల రామ నవమి సందర్భంగా మధ్యప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా కొన్ని రాష్ట్రాల్లో మతపరమైన హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం, వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇందులో కొన్ని ఘ‌ట‌న‌ల్లో కొన్ని వాహనాలను తగులబెట్టారు. రాళ్లు రువ్వారు. 

ఈ ఘ‌ట‌నల నేప‌త్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మే నెల 4వ తేదీ వరకు అన్ని పోలీసు, అడ్మినిస్ట్రేటివ్ అధికారుల‌కు సెలవులను రద్దు చేశారు. సెలవుల్లో ఉన్న వారందరూ 24 గంటల్లోగా రిపోర్టు చేయాలని కోరారు. పండుగల సమయంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు వచ్చే 24 గంటల్లోగా మత పెద్దలతో చర్చలు జరపాలని పోలీసు స్టేషన్ నుంచి ఏడీజీ స్థాయి వరకు అధికారులను ఆయ‌న ఆదేశించారు. 

‘‘ SHO, CO., జిల్లా పోలీసు చీఫ్‌ల నుండి జిల్లా మేజిస్ట్రేట్, డివిజనల్ కమిషనర్ వరకు అన్ని అడ్మినిస్ట్రేటివ్, పోలీసు అధికారుల సెలవులు తక్షణం నుంచి మే 4 వరకు రద్దు చేయబడ్డాయి. ప్రస్తుతం సెలవులో ఉన్న వారు తప్పనిసరిగా పోస్టింగ్ స్థలానికి 24 గంటల్లో తిరిగి రావాలి. ఈ ఏర్పాట్ల‌ను సీఎం కార్యాల‌యం నిర్ధారించాలి ’’ అని ఆయన అధికారిక ప్రకటనలో తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి, పరిస్థితిని గమనించడానికి డ్రోన్లను ఉపయోగించాలని చెప్పారు. ప్రతీ సాయంత్రం, పోలీసు బలగాలు తప్పనిసరిగా ఫుట్ పెట్రోలింగ్ చేయాలని, పోలీసు రెస్పాన్స్ వెహికల్ (PRV) చురుకుగా ఉండాలని ఆదిత్యనాథ్ ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం