
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ కు సుప్రీంకోర్టులో పెద్ద ఉపశమనం లభించింది. ప్రవక్త మహమ్మద్‌పై విద్వేషపూరిత ప్రకటన చేసి ముస్లింల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆమెను అరెస్టు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేదు.
అధ్యక్షుడిని అవుతానో? లేదో? అప్పుడే తేలుతుంది: రాహుల్ గాంధీ
శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను స్వీకరించే అంశంపై విచారణ జరిపి దానిని నిరాకరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించిది. ‘‘ పిటిషనర్ న్యాయవాది అబు సోహెల్‌ను నూపుర్ శర్మకు వ్యతిరేకంగా చేసిన అభ్యర్థన హానికరం కాదు. అయితే ఇది చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంది. కోర్టు ఆదేశాలు జారీ చేసేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం ’’ అని పేర్కొన్నారు.
ప్రవక్త మొహమ్మద్, ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా శర్మ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, అందువల్ల ఆమెను తక్షణమే అరెస్టు చేసేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. శర్మపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిని అత్యవసరంగా విచారించాలని న్యాయవాది కోరారు.శర్మ ప్రకటనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21, 26, 29 తో పాటు ఇతర ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు.
‘‘శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ అశాంతి, అలజడికి కారణమయ్యాయి. మన దేశానికి ఉన్న గొప్ప ప్రతిష్టను దిగజార్చాయి. ’’ అని న్యాయవాది పేర్కొన్నారు. అడ్వకేట్ అబు సొహైల్ తరపున అడ్వకేట్ చాంద్ ఖురేషీ ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ స్వతంత్ర, విశ్వసనీయ, నిష్పక్షపాత విచారణ’ను ఆయన తన పిటిషన్ లో లేవనెత్తారు. కాగా.. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ ఢిల్లీ పోలీసులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే కోరింది. భారతదేశంలోని అనేక నగరాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ లలో నూపుర్ శర్మకు వ్యతిరేకంగా ఫిర్యాదులు నమోదైన సంగతి తెలిసిందే.
జూన్ నెల ప్రారంభంలో ఓ టీవీ చర్చలో మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి దేశమంతా దుమారాన్ని రేపాయి. ప్రపంచలోని అనేక గల్ప్ దేశాలు కూగా ఈ వ్యాఖ్యలను ఖండించాయి. ఆయా దేశాల్లో ఉంటున్న భారత రాయభారులను పిలిపించుకొని వివరణ అడిగాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇవి హింసాత్మకంగా మారాయి. దీంతో ఆమెను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
సీపీఎం నేత సీతారాం ఏచూరిని కలిసిన హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా
నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై కూడా దాడులు జరిగాయి. మహారాష్ట్రలో, రాజస్థాన్ లో ఇద్దరి హత్య జరిగినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో టైలర్ గా పని చేస్తున్న కన్హయ్య లాల్ ను ఆయన షాప్ లో పలువురు దుండగులు దారుణంగా చంపేశారు. ఈ హత్యకు సంబంధించి దుండుగులు వీడియోను కూడా విడుదల చేశారు. అలాగే మహారాష్ట్రలోని అమరావతిలో వెటర్నరీ ఫార్మసిస్టుగా పని చేసే ఉమేష్ కోల్హే హత్యకు గురయ్యాడు. వీటిపై ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరుపుతోంది.