సీఏఏపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై పలు దేశాలకు చెందిన హిందూ, సిక్కు శరణార్థులు మండిపడ్డారు. సీఎం నివాసం ఎదుట నిరసన తెలిపారు. దీంతో కేజ్రీవాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ హిందూ, సిక్కు శరణార్థులు ఆయన నివాసం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. అయితే దీనిపై కేజ్రీవాల్ అసహనం వ్యక్తం చేశారు. వారిని పాకిస్థానీలు అని పిలిచి, వారికి ఎంత ధైర్యముందని ప్రశ్నించారు.
‘‘ఈ పాకిస్థానీలకు ఇంత ధైర్యమా ? మొదట వారు మన చట్టాలను ఉల్లంఘించి మన దేశంలోకి అక్రమంగా చొరబడ్డారు. వారు జైల్లో ఉండాల్సింది. కానీ మన దేశంలో నిరసన తెలిపే దమ్ము, అశాంతికి కారణమయ్యే దమ్ము వారికి ఉందా? సీఏఏ అమలు తర్వాత పాకిస్థానీలు, బంగ్లాదేశీయులు దేశమంతటా విస్తరించి ప్రజలను వేధిస్తారు. బీజేపీ తన స్వార్థ ప్రయోజనాల కోసం యావత్ దేశాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది’’ అని కేజ్రీవాల్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
రోహిణి, ఆదర్శ్ నగర్, సిగ్నేచర్ బ్రిడ్జి, మజ్ను కా తిల్లా సమీపంలో నివసిస్తున్న హిందూ, సిక్కు శరణార్థులు నిరసనలో పాల్గొన్నారు. సీఏఏ, శరణార్థులకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ‘‘నరేంద్ర మోడీ ప్రభుత్వం తమకు పౌరసత్వం ఇస్తుంటే, కేజ్రీవాల్ మాకు ఉద్యోగాలు, ఇళ్లు ఎవరు ఇస్తారని అడుగుతున్నారు. ఆయనకు మా బాధ అర్థం కావడం లేదు’’ అని నిరసనకారుల్లో ఒకరైన పంజురామ్ ‘పీటీఐ’తో అన్నారు.
इन पाकिस्तानियों की हिम्मत? पहले हमारे देश में ग़ैर क़ानूनी तरीक़े से घुसपैठ की, हमारे देश का क़ानून तोड़ा। इन्हें जेल में होना चाहिए था। इनकी इतनी हिम्मत हो गयी कि हमारे देश में प्रदर्शन कर रहे हैं, हुडदंग कर रहे हैं? CAA आने के बाद पूरे देश में पाकिस्तानी और बांग्लादेशी फैल… https://t.co/xjVVrrglt7
— Arvind Kejriwal (@ArvindKejriwal)కాగా.. సీఏఏ ద్వారా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లోని మైనారిటీ వర్గాలకు చెందిన పేదలను దేశంలో స్థిరపరచాలని, తమకు ఓటు బ్యాంకును సృష్టించుకోవాలని బీజేపీ కోరుకుంటోందని కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికి ఉద్యోగాలు, ఇళ్లు ఇస్తామని, దీనివల్ల స్థానికులపై ప్రభావం పడుతుందని ఆరోపించారు. అంతకు ముందు రోజు చేసిన మరో ట్వీట్ లో.. ‘‘ఈ రోజు కొందరు పాకిస్థానీయులు నిరసన వ్యక్తం చేసి నా ఇంటి ముందు హంగామా సృష్టించారు. ఢిల్లీ పోలీసులు వారికి పూర్తి గౌరవం, రక్షణ కల్పించారు. వారికి బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపింది.’’ అని ఆరోపించారు.
‘‘ఢిల్లీ ప్రజలు అఖండ మెజారిటీతో ఎన్నుకున్న సీఎంను మన దేశంలోకి ప్రవేశించి క్షమాపణలు చెప్పేంత ధైర్యం వారికి ఉందా? మరి బీజేపీ వారికి మద్దతిస్తోందా? బీజేపీ నన్ను ద్వేషించి పాకిస్థానీలకు అండగా నిలిచింది, భారత్ కు ద్రోహం చేయడం ప్రారంభించిందా? ఈ సీఏఏ తర్వాత ఈ పాకిస్థానీయులు దేశమంతటా విస్తరిస్తారని, అదే విధంగా మన దేశ ప్రజలను వేధించి అల్లకల్లోలం సృష్టిస్తారని అన్నారు. వారిని తమ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది.’’ అని పేర్కొన్నారు.
2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ కు వచ్చిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం ఇచ్చేందుకు మార్గం సుగమం చేస్తూ కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం-2019ను సోమవారం అమల్లోకి తెచ్చింది.