
హత్య కంటే అత్యాచారం హేయమైనదిగా ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు పేర్కొంది. నిస్సహాయ మహిళ ఆత్మను నాశనం చేసే అత్యాచారం.. హత్య కంటే ప్రమాదకరమని అభిప్రాయపడింది. ఓ అత్యాచారం కేసులో విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2012లో మానసిక వికలాంగురాలైన 15 ఏళ్ల బాలికపై సాముహిక అత్యాచారానికి యత్నించిన యువకుడికి కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో రెండో నిందితుడు విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలోనే మరణించాడు. ఈ కేసులో బాధిత మహిళ శిక్ష విధింపబడిన వ్యక్తికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది.
‘‘బాధితురాలు యొక్క సాక్ష్యం నమ్మదగినది. విశ్వాసం కలిగించేది. నిందితులు అత్యాచారం చేయాలనే ఉద్దేశ్యంతో బాధితురాలిని ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ మేరకు అంగీకరించాలి...’’ అని ప్రత్యేక న్యాయమూర్తి హెచ్‌సి షెండే అన్నారు. ఇది తప్పుడు కేసు.. నిందితుడిని తప్పుగా ఇరికించారనే అతడి తరఫు లాయర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. నిందితులు చిన్నారికి తెలుసని కోర్టు పేర్కొంది. ‘‘బాధితురాలు విషయాలను చెప్పడంలో నెమ్మదిగా ఉన్నప్పటికీ.. నిజమైన ధ్రువీకరణ ఇచ్చారు. ప్రస్తుతం నిందితుడిగా ఉన్న వ్యక్తిని నేరానికి పాల్పడినట్టుగా గుర్తించారు. అలాగే చనిపోయిన నిందితుడిపై సాక్ష్యం చెప్పారు’ అని కోర్టు తెలిపింది.
ఇక, ఈ కేసుకు సంబంధించి బాధితురాలి తల్లి పోలీసులకు సమాచారం అందించింది. బాలిక సోదరులు రోజూ పాఠశాలకు వెళ్తుండగా.. ఆమె మానసిక పరిస్థితి కారణంగా ఇంట్లోనే ఉండేదది. బాలిక తల్లి 2015 సెప్టెంబర్ 4వ తేదీన పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించింది. దీంతో బాలికను అసలు ఏం జరిగిందని అడిగితే.. నిందితులు రూ.10 ఎరగా చూపి తనను ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించారని తల్లికి చెప్పింది. గతంలో కూడా ఇలాగే జరిగిందని చిన్నారి తెలిపింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
‘‘సాధారణంగా అత్యాచారం నేరం దాని స్వభావంతో తీవ్రమైనది. అంతకుమించి నేరానికి పాల్పడిన వ్యక్తి మైనర్ బాధితురాలిపై అత్యాచారం చేసినప్పుడు.. సాధారణ క్రిమినల్ పదజాలంలో కూడా.. హత్య కంటే అత్యాచారం అనేది మరింత ఘోరమైన నేరం. అది నిస్సహాయ మహిళ ఆత్మనే నాశనం చేస్తుంది. ఈ విషయంలో మైనర్ బాధితురాలు నిదానంగా మాట్లాడే అమ్మాయి’’ అని కోర్టు పేర్కొంది.