కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై రాజస్థాన్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. తల్లిదండ్రుల ఆగ్రహం..

Published : Sep 15, 2023, 06:42 AM IST
కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై రాజస్థాన్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. తల్లిదండ్రుల ఆగ్రహం..

సారాంశం

Rajasthan: రాజస్థాన్ కోటా లో విద్యార్థుల వరుస ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారాలు ఉన్నట్లు పేర్కొన్న ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను బాధిత తండ్రి ఖండించారు. ఇటీవల కోటాలోని ఓ హాస్టల్ లో 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Rajasthan: ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ లోని కోటా లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం కూడా ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నీట్ కోచింగ్ తీసుకుంటున్న జార్జండ్ చెందిన రిచా సిన్హా (16) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ వివాదాస్పద ప్రకటన చేశారు. విద్యార్థుల ఆత్మహత్యకు తల్లిదండ్రుల ఒత్తిడి, ప్రేమ వ్యవహారమే కారణమని ఆయన ఆరోపించారు.  

16 ఏళ్ల రిచా సిన్హా మృతి ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినుల వ్యవహారాలకు సంబంధించిన లేఖలు లభ్యమైనట్లు వ్యాఖ్యానించారు. బుధవారం కోటాలోని ఓ హాస్టల్ లో 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందనీ, ఆ ఘటన స్థలంలో ఓ ప్రేమ లేఖ దొరికిందని ఆరోపించారు. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలన్నింటినీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల ఒత్తిడి కూడా విద్యార్థుల మరణాలకు ఓ కారణమని ధరీవాల్ వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం కోటాలో సిటీ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు. 

బాధితురాలి తండ్రి ఆగ్రహం

అయితే.. మంత్రి వ్యాఖ్యలను బాధిత తండ్రి రవీంద్ర సిన్హా ఖండిస్తున్నారు.  ప్రేమ వ్యవహారంతోనే తన కుమార్తె ప్రాణాలు విడిచిందని, ఆధారాలు ఉంటే చూపించండని డిమాండ్ చేశారు. కోచింగ్‌ సెంటర్ కు వెళ్లే సమయంలో కొందరు అబ్బాయిలు తనను వేధించేవారని తన కుమార్తె ఫిర్యాదు చేసిందని ఆయన చెప్పారు. విద్యార్థులకు హాస్టల్ కల్పిస్తున్న సౌకర్యాలపైనా బాధిత తండ్రి  అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కచ్చితమైన కారణాన్ని కనుక్కోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. కోటాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?