రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు రెండో సారి కరోనా పాజిటివ్.. తనయుడికీ కొవిడ్

By Mahesh KFirst Published Jan 6, 2022, 7:18 PM IST
Highlights

రాజస్తాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ రోజు తాను కరోనా టెస్టు చేయించుకున్నారని, రిపోర్టు పాజిటివ్‌గా వచ్చినట్టు ఆయన వెల్లడించారు. స్వల్ప లక్షణాలే ఉన్నాయని, తనతో కాంటాక్టులోకి వచ్చిన వారంతా ఐసొలేషన్‌లోకి వెళ్లాలని, కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు. 2021లోనూ ఆయన కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. అప్పుడు.. ఆయన సతీమణికి కరోనా సోకిన గంటల తర్వాత అశోక్ గెహ్లాట్ ఈ వైరస్ బారిన పడగా.. తాజాగా, ఆయన కుమారుడికి వైరస్ సోకిన తర్వాతి రోజు సీఎంకు పాజిటివ్ అని తేలింది.
 

జైపూర్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు(Coronavirus Cases) పెరుగుతున్నాయి. ఒమిక్రాన్(Omicron Cases) కేసులూ భారీగా పెరిగిపోతున్నాయి. రాజస్తాన్‌(Rajasthan) కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఏకంగా సీఎం అశోక్ గెహ్లాట్‌(CM Ashok Gehlot)కే కరోనా పాజిటివ్(Positive) అని తేలింది. ఆయనకు కరోనా సోకడం ఇదే తొలిసారి  కాదు. గతంలోనూ ఆయన కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా, మరోసారి ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఆయన తనయుడికి కరోనా వైరస్ సోకిన తర్వాతి రోజు ఈయనకు పాజిటివ్ అని తేలడం గమనార్హం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని వివరించారు.

రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్... తాను కరోనా బారిన పడ్డట్టు గురువారం వెల్లడించారు. అంతేకాదు, ఆయనకు స్వల్ప స్థాయిలోనే కరోనా లక్షణాలు ఉన్నాయని వివరించారు. ఈ రోజు సాయంత్రం తాను కరోనా టెస్టు చేయించుకున్నారని తెలిపారు. అందులో తనకు కరోనా పాజిటివ్ అని తేలినట్టు ట్వీట్ చేశారు. తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, అంతకు మించిన సమస్య ఏమీ లేదని వివరించారు. అయితే, తనతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారు అందరూ ఐసలేషన్‌లో ఉండాలని సూచించారు. అనంతరం కరోనా టెస్టు కూడా తప్పనిసరిగా చేయించుకోవాలని వివరించారు.

అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్‌కు కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. వైభవ్ గెహ్లాట్‌ కరోనా బారిన పడటంతో సీఎం అశోక్ గెహ్లాట్ కూడా కరోనా టెస్టు చేయించుకున్నారు. 2021లోనూ అశోక్ గెహ్లాట్‌కు కరోనా సోకింది. అప్పుడు కూడా ఆయన కుటుంబంలో వైరస్ ప్రవేశించిన తర్వాతే ఆయనకూ పాజిటివ్ అని వచ్చింది. 2021లో అశోక్ గెహ్లాట్ సతీమణి సునితా గెహ్లాట్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈమెకు కరోనా పాజిటివ్ అని తేలిన గంటల వ్యవధిలోనే అశోక్ గెహ్లాట్‌ కూడా కరోనా బారిన పడ్డట్లు రిపోర్టు వచ్చింది. అప్పుడు అశోక్ గెహ్లాట్‌లో అసలు కరోనా లక్షణాలే కనిపించలేవు.

రాజస్తాన్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. జైపూర్, జోద్‌పూర్ పరిధిలోని స్కూళ్లను మూసే ఉంచాలనే ఆదేశాలు జారీ చేశారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠశాలను వచ్చే నెల 17వ తేదీ వరకు క్లోజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏరియాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసే ఉండనున్నాయి. ప్రత్యక్షంగా తరగతులు లేకున్నా.. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడానికి అధికారులు ఓకే చెప్పారు.

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా  90,928 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా Covidతో 325 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,82,876కి చేరింది. నిన్న దేశంలో కరోనా నుంచి 19,206 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,43,41,009కి చేరంది. ప్రస్తుతం దేశంలో 2,85,401 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 2,630 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 995 మంది కోలుకున్నారు. 

click me!