
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ ఆదివారం నాడు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ గాంధీ నివాసానికి పోలీసులు వచ్చి నోటీసులు జారీ చేయడంపై ఆశోక్ గెహ్లాట్ స్పందించారు.పోలీసుల చర్యను ఆశోక్ గెహ్లాట్ తప్పుబట్టారు. అయితే ఈ విషయమై ఆయన స్పందిస్తూ ఇందిరాగాంధీ హయంలో ఈ రకంగా పోలీసులు నేరుగా ఇంట్లోకి ప్రవేశించే వారని ఆయన నోరు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఉద్దేశ్యపూర్వకంగా గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండరని కొందరు కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. పొరపాటున గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఆశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై అంకుర్ సింగ్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. ఆశోక్ గెహ్లాట్ ఎవరివైపు అని ఆయన ప్రశ్నించారు
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీని కలిసిన మహిళలు తమపై అత్యాచారాలు జరిగినట్టుగా చెప్పారని రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సభలో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి బాధిత మహిళల వివరాలను పోలీసులు అడిగారు. ఈ విషయమై రాహుల్ ను అడిగేందుకు వచ్చినట్టుగా పోలీసులు చెప్పారు.దీంతో పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.