కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న అశోక్ గెహ్లాట్.. సోనియాకి క్షమాపణలు

By Siva KodatiFirst Published Sep 29, 2022, 2:58 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసు నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్పుకున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసు నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్పుకున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే సమయంలో సోనియా గాంధీకి ఆయన క్షమాపణలు చెప్పినట్లుగా తెలుస్తోంది. సోనియా నివాసం నుంచి బయటకొచ్చిన తర్వాత అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను పోటీ చేయడం లేదన్నారు. రాజస్థాన్‌లో జరిగిన పరిణామాలు చాలా బాధాకరమన్న ఆయన.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ మధ్యే పోటీ వుంటుందన్నారు. రాజస్థాన్ సీఎంగా గెహ్లాట్‌ను కొనసాగించాలా వద్ద అన్న అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు సోనియా గాంధీ. 

మొన్నటి వరకు అధ్యక్ష రేసులో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ హాట్ ఫేవరేట్ అభ్యర్థిగా నిలిచారు. కానీ, సీఎం పోస్టుపై ఆయన ప్రత్యర్ధి వర్గం తిరుగుబాటు చేయడం గాంధీలు సహా ఢిల్లీలోని ఇతర సీనియర్ నేతలను అసంతృప్తి పరిచింది. అయినప్పటికీ అశోక్ గెహ్లాట్ నామినేషన్ చేస్తారని అంతా భావించారు. అయితే సోనియాతో భేటీ తర్వాత రాజస్తాన్ సీఎం అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 

ALso REad:రాజస్థాన్ సీఎం పీఠం విషయంలో పార్టీ హైకమాండ్, అశోక్ గెహ్లాట్‌తో మాట్లాడలేదు - సచిన్ పైలెట్

మరోవైపు... కాంగ్రెస్ అధ్యక్ష బరిలో సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడైన దిగ్విజయ్ సింగ్ కూడా నామినేషన్ వేయనున్నారు. ఆయన ఈ రోజు నామినేషన్ పేపర్లు కలెక్ట్ చేసుకున్నారు. ఈ మేరకు డిగ్గీరాజా విలేకరులకు వివరాలు వెల్లడించారు. ‘నేను నామినేషన్ పేపర్లు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. రేపు నా నామినేషన్ పత్రాలు సమర్పిస్తాను’ అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్లు సమర్పించడానికి గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. ఇప్పటి వరకు ఏ ఒక్కరూ నామినేషన్ దాఖలు చేయలేదని సమాచారం. ఇప్పటి వరకు అధ్యక్ష అభ్యర్థిగా శశిథరూర్ ఒక్కరే ఉన్నారు. ఆయన కూడా రేపే నామినేషన్లు వేయనున్నారు. 

click me!