Rajasthan: ఈద్‌కు ముందు రాజస్థాన్‌లో ఘర్షణలు.. పోలీసుల‌పై దాడి.. ఇంటర్నెట్ ష‌ట్డౌన్ !

Published : May 03, 2022, 10:47 AM IST
Rajasthan: ఈద్‌కు ముందు రాజస్థాన్‌లో ఘర్షణలు.. పోలీసుల‌పై దాడి.. ఇంటర్నెట్ ష‌ట్డౌన్ !

సారాంశం

Clashes In Rajasthan: ఈద్‌కు ముందు రాజస్థాన్‌లో ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగాయి. జోధ్‌పూర్‌లోని జలోరీ గేట్ ప్రాంతంలో ఇరువర్గాలు మత జెండాలను ఎగురవేయడంపై భిన్నాభిప్రాయాలు రావడంతో ఘర్షణలు చెలరేగాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడకు వచ్చిన పోలీసులపైనా రాళ్లు రువ్వారు. భారీగా మోహరించిన పోలీసులతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  ఈ క్ర‌మంలో అధికారులు ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేశారు.   

Jodhpur Clashes : ఈద్‌కు ముందు రాజస్థాన్‌లో ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగాయి. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే రంగంలోకి దిగిన పోలీసులు ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. అయితే, ఇప్ప‌టికే ఆయా ప్రాంతాల్లో పరిస్థితుల‌పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అల్ల‌ర్లు మ‌రింత ముద‌ర‌కుండా పోలీసులు భారీగా మోహ‌రించారు. అలాగే, ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేశారు. వివ‌రాల్లోకెళ్తే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సోమవారం రాత్రి ఈద్‌కు ముందు జలోరీ గేట్ ప్రాంతంలో రెండు వ‌ర్గాల‌కు చెందిన వారు త‌మ‌ జెండాలు ఎగురవేయడంపై వివాదం చెలరేగిందని పోలీసులు తెలిపారు. మొద‌ట వాగ్వివాదంతో మొద‌లైన.. ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసిందని తెలిపారు. ప్ర‌జలు పుకార్లు వ్యాప్తి చేయకుండా నిరోధించడానికి జోధ్‌పూర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. ఈద్ కోసం ప్రార్థ‌న స్థలాలు, కార్య‌క్ర‌మాల‌ను పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నారు. 

ప్ర‌స్తుతం జోధ్‌పూర్‌లో మూడు రోజుల పరశురామ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ఈద్ ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రెండు వర్గాలు పెట్టిన మతపరమైన జెండాలు ఘర్షణలకు దారితీశాయ‌ని పోలీసు వ‌ర్గాలు పేర్కొన్నాయి. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు టియర్-గ్యాస్ షెల్స్ ను ప్ర‌యోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల‌కు చెందిన ప‌లువురు స్థానిక పోలీసు పోస్ట్‌పై  దాడి చేశారు. మంగళవారం తెల్లవారుజామున రాళ్లు రువ్వడంతో కనీసం నలుగురు పోలీసులు గాయపడ్డారు.  "రాళ్ల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భారీ పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు" అని పోలీసు కంట్రోల్ రూమ్‌లోని ఒక అధికారి మీడియాకు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగానే కొన‌సాగుతున్న‌ది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్  శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

"జోధ్‌పూర్, మార్వార్ ల‌ ప్రేమ మరియు సోదర సంప్రదాయాన్ని గౌరవిస్తూ, శాంతిని కాపాడాలని మరియు శాంతిభద్రతలను పునరుద్ధరించడంలో సహకరించాలని నేను అన్ని పార్టీలకు హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాను" అని ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్‌లో పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడాలని తాను పరిపాలనను ఆదేశించినట్లు గెహ్లాట్ తెలిపారు. 

 

ఇటీవ‌ల గ‌త కొంత కాలంగా ఉద్రిక్త‌త‌ల‌ను రెచ్చ‌గొడుతూ నాయ‌కులు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు.  ముఖ్యంగా మతపరమైన, రాజకీయ నాయకుల ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా దేశవ్యాప్తంగా మతపరమైన హింస మరియు ఉద్రిక్తతల పెరుగుదల నేప‌థ్యంలోనే రాజ‌స్థాన్ లో తాజా ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. భారతదేశం రామ నవమి, హనుమాన్ జయంతి మరియు రంజాన్‌ను జరుపుకుంటున్నందున గత కొన్ని వారాలుగా ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ల‌తో పాటు చాలా రాష్ట్రాల్లో ఇటువంటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.  దేశంలో పెరుగుతున్న ద్వేషం,  కలహాలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడం, అసమ్మతిని నియంత్రించడంలో ప్రభుత్వ ప్రయత్నాలపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu