
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తృటిలో తప్పిపోయింది. నిగోహన్ రైల్వే స్టేషన్‌లో లూప్ లైన్‌లోని రైల్వే ట్రాక్స్ మండుతున్న ఎండలకు కరిపోతున్నది. శనివారం నాటి తీవ్రమైన ఎండలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ట్రాక్స్ మీదుగా వెళ్లుతున్న రైలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది.
నిలాంచల్ ఎక్స్‌ప్రెస్ నిగోహన్ రైల్వే స్టేషన్‌లో మెయిన్ లైన్ కాకుండా లూప్ లైన్‌లోకి వెళ్లింది. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ట్రైన్ లూప్ లైన్‌లోకి వెళ్లగా.. అక్కడ ఎండలతో తీవ్రంగా వేడెక్కి ఉన్న పట్టాలు కరిగిపోవడం మొదలైంది. ఫలితంగా ఆ పట్టాలు వెడల్పుగా మారాయి.
రైల్వే ట్రాక్ వెడల్పుగా మారుతుండటంతో రైలు చక్రాలతో ఘర్షణ ఏర్పడ్డది. ఆ నిలాంచల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ వెంటనే ట్రైన్‌ను నిలిపేశాడు. వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరవేశాడు. ఇంజినీరింగ్ సెక్షన్ ఉద్యోగులు వెంటనే సమస్యను గుర్తించారు. ఆ ట్రాక్ రిపేర్ చేయడాన్ని ప్రారంభించారు.
Also Read: యూపీలో వడగాలుల బీభత్సం.. మూడు రోజుల్లో 54 మంది మృతి, 400 మంది ఆస్పత్రికి..
లక్నో జంక్షన్ చేరుకున్న తర్వాత లోకో పైలట్ ఈ ఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. సమాచారాన్ని అందించాడు. రైల్వే డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారులు, ఉద్యోగులు డ్యామేజీ అయిన ట్రాక్స్‌ను పరిశీలించారు. రిపేర్ చేయాలని వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
ఈ లూప్ లైన్‌ను వినియోగించకుండా స్టేషన్ మాస్టర్‌ను అలర్ట్ చేశారు.
ట్రాక్‌లను సరిగ్గా మెయింటెయిన్ చేయని కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని లక్నో డివిజనల్ రైల్వే మేనేజర్ సురేశ్ సప్రా తెలిపారు. నిగోహన్ రైల్వే స్టేషన్‌లో వేరే ట్రైన్‌లు ఆగి ఉండటం వల్ల నిలాంచల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్‌లోకి వెళ్లిందని వివరించారు.