
Karnataka BJP: కర్నాటక అసెంబ్లీకి జరిగే ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్రంలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారుతున్నాయి. రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ సహా ఇతర ప్రధాన పార్టీలు రానున్న ఎన్నికల లక్ష్యంగా ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లడినికి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్త యాత్రలపై దృష్టి సారించాయి. ఇక కాంగ్రస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలోని ముందుకు సాగుతున్నదేశవ్యాప్త భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. ఇదే సమయంలో భారత్ జోడో యాత్రకు పోటీగా అధికార పార్టీ బీజేపీ సైతం రాష్ట్రంలో యాత్రకు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీజేపీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడియూరప్పతో కలిసి మంగళవారం రాయచూర్ లో జన సంకల్ప యాత్రను బీజేపీ ప్రారంభించనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోని కనీసం 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో "జన సంకల్ప యాత్ర"ను మంగళవారం ఇద్దరు అగ్రనాయకులు ప్రారంభించనున్నారు. ఈ యాత్ర అక్టోబర్ 20 వరకు రాష్ట్రంలో కొనసాగనున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ' భారత్ జోడో యాత్ర'తో సమానంగా ఉండనుందని సమాచారం. “ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్పతో కలిసి మంగళవారం రాయచూర్ నుండి జన సంకల్ప యాత్ర (జేఎస్‌వై) ప్రారంభించనున్నారు. యాత్ర డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో ఇద్దరు నేతలు 50 అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేస్తారు” అని బీజేపీ ఆఫీస్ బేరర్ తెలిపారు.
ప్రస్తుతం రాయచూర్ నుంచి మూడు రోజుల పాటు పర్యటన ఉంటుందనీ, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ వేరే ప్రాంతం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చే మూడు రోజులు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సుడిగాలి పర్యటనలో ఉంటారని ఆయన చెప్పారు. బొమ్మై మంగళవారం ఉదయం బళ్లారికి బయలుదేరి, అక్కడి నుంచి మధ్యాహ్నం రాయచూరు చేరుకుని జన సంకల్ప యాత్రలో పాల్గొంటారు. మరో మూడు రోజుల్లో రాయచూర్‌లోని మస్కీ, కొప్పల్‌లోని కుష్టగి, విజయనగరం జిల్లా కేంద్రమైన హూవినహడగలి, హోస్పేట్, బళ్లారి జిల్లాలోని సిరిగుప్పలో ఆయన యాత్రకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రెండు రోజుల తర్వాత అక్టోబర్ 16న మైసూరులో జరిగే ఎస్సీ మోర్చా సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ నెలలో బొమ్మై బీదర్, యాద్గిర్, కలబురగి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 30న కలబురగిలో జరిగే ఓబీసీ మోర్చా సమావేశానికి ఆయన హాజరవుతారని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర చీఫ్ నళిన్ కుమార్ కటీల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇంచార్జి అరుణ్ సింగ్ కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీజేపీ జన సంకల్ప యాత్రను ప్రారంభించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, అంతకుముందు రోజు మాజీ సీఎం, బీజేపీ నాయకుడు బీఎస్ యడియూరప్ప.. రాహుల్ గాంధీ చేపట్టిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు. కర్నాటకలో కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని అన్నారు. రాహుగ్ గాంధీ భారత్ జోడో యాత్రకు విలువ లేదని పేర్కొన్నారు. ఒకటి రెండు చోట్ల తప్ప దేశమంతా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గిపోతున్నదని విమర్శించారు.