అమ్మపై ప్రేమ.. సోనియా షూ లేస్‌ను సరిచేసిన రాహుల్ గాంధీ.. వైరల్ అవుతున్న ఫోటో..

By Sumanth KanukulaFirst Published Oct 6, 2022, 12:24 PM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఈ రోజు ఆయన తల్లి సోనియా గాంధీ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి పలు ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతుంది. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఈ రోజు ఆయన తల్లి, పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. రాహుల్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోనియా ముందుకు సాగుతున్నారు. ఇందుకు సంబంధించి పలు ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతుంది. అందులో రాహుల్ గాంధీ.. తన తల్లి సోనియా గాంధీ షూ లేస్‌లను సరిచేస్తున్నారు. పాదయాత్ర మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు.. తల్లి-కొడుకుల అనుబంధం అంటే ఇదేనని, తల్లిని మించి దైవం ఎవరూ లేరని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల విరామం తర్వాత భారత్ జోడో యాత్రను తిరిగి ప్రారంభించారు. గురువారం ఉదయం మాండ్యా జిల్లా పాండవపుర తాలూకాలోని బెల్లాలే గ్రామం నుంచి ప్రారంభించారు. రాహుల్ పాదయాత్ర జకన్నహళ్లి చేరుకున్న సమయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో సోనియా కలిసి నడిచారు. అయితే కొద్దిసేపు రాహుల్, పార్టీ నాయకులతో కలిసి నడిచిన తర్వాత.. రాహుల్ కోరడంతో ఆమె కారులో యాత్రను ఫాలో అయ్యారు. కొద్ది విరామం తర్వాత సోనియా గాంధీ.. కారు దిగి పాదయాత్రలో రాహుల్, పార్టీ శ్రేణులతో కలిసి నడుస్తున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి నడుస్తున్న సోనియా గాంధీ.. అక్కడి వారితో నవ్వుతూ కనిపించారు. 

ఈ రోజు రాహుల్ పాదయాత్ర నాగమంగళ తాలూకాలోని బ్రహ్మదేవరహళ్లి‌లో ముగియనుంది. అక్కడే బహిరంగ సభను కూడా నిర్వహించనున్నారు. నాగమంగళ తాలూకాలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఎదురుగా ఉన్న మడకె హోసూరు గేటు వద్ద రాహుల్ గాంధీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రాత్రి స్టే చేయనున్నారు. 


రాహుల్ పాదయాత్రలో పాల్గొనేందుకు సోనియా గాంధీ.. అక్టోబర్ 3వ తేదీన కర్ణాటకకు చేరుకన్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కూర్గ్‌లోని మడికేరికి వెళ్లి ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బస చేశారు. మైసూర్‌లో పాదయాత్రను పూర్తిచేసుకున్న రాహుల్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక, బుధవారం దసరా సందర్భంగా ఆమె మైసూర్‌ జిల్లాలోని హెచ్‌డీ కోట అసెంబ్లీ సెగ్మెంట్‌లోని బేగూర్ గ్రామంలోని భీమనకొల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక, నేడు ఉదయం తన కుమారుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు పార్టీ  నాయకులు, కార్యకర్తలతో ఆమె కలిసి నడుస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళనాడు, కేరళలో యాత్రను పూర్తి చేసుకున్న రాహుల్..  సెప్టెంబర్ 30న కేరళ సరిహద్దులోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట మీదుగా కర్ణాటకలోకి ప్రవేశించారు. 

ఇక, అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో సైతం పాల్గొనలేకపోయారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనే పార్టీ బహిరంగ కార్యక్రమంలో గాంధీ పాల్గొని చాలా కాలం అయ్యింది. ఈ క్రమంలోనే చాలా కాలం తర్వాత భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ పాల్గొనడంతో.. కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. 
 

click me!