
ఢిల్లీ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో ప్రోఫెసర్ కంచె ఐలయ్య రాసిన పుస్తకాలపై విశ్వవిద్యాలయం నిషేధం విధించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయనకు మద్ధతుగా నిలిచారు.
ఐలయ్యకు లేఖ రాసిన రాహుల్.. మీ పుస్తకాలను నిషేధించడం.. దళితులను అణగదొక్కేందుకు ఆరెస్సెస్ చేస్తున్న ప్రయత్నమేనంటూ విమర్శించారు. దళితులను, శూద్రులను అణగదొక్కేందుకే వారు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారన్నారు..
హిందుత్వ ఏజెండాను ఏకపక్ష భావజాలంతో ప్రచారం చేసేందుకు ఆరెస్సెస్ చేస్తున్న ఈ ప్రయత్నాలు తీవ్ర అభ్యంతకరకమని రాహుల్ అభిప్రాయపడ్డారు. దాదాపు దశాబ్ధకాలంగా ఐలయ్య పుస్తకాలను విద్యార్థులు పాఠ్యాంశాలుగా అభ్యసిస్తున్నారని స్పష్టం చేశారు.
పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో ప్రొ.కంచె ఐలయ్య రాసిన పుస్తకాలను తొలగించాలని విశ్వవిద్యాలయం సిఫారసు చేయడం వివాదానికి దారి తీసింది. విద్యాపర విషయాల్లో దళిత్ అనే పదం స్థానంలో ‘‘షెడ్యూల్డ్ కులం’’ను వాడాలని పేర్కొంది.
గత బుధవారం విద్యావిషయాలపై జరిగిన వర్సిటీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో.. 9 పీజీ కోర్సులపై కమిటీ చర్చించింది. ఐలయ్య రాసిన ‘‘ వై ఐ యామ్ నాట్ ఎ హిందూ’’, ‘‘ పోస్ట్ హిందూ ఇండియా’’ వివాదాస్పద విషయాలు ఉన్నట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది.