
కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) నేపాల్ పర్యటన (nepal) మనదేశంలో రాజకీయంగా అగ్గి రాజేసింది. దీనికి సంబంధించి కాంగ్రెస్, బీజేపీల (bjp) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనిపై బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాలవీయ (amit malviya) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత వ్యతిరేక శక్తులతో రాహుల్‌కు సంబంధాలు ఏంటి? అని ఆయన నిలదీశారు.
రాహుల్ తన స్నేహితురాలు అని చెప్పుకుంటున్న సుమ్నిమా ఉదాస్ (sumnima udas) వివాహానికి హాజరయ్యారు. ఆమె నేపాలీ దౌత్యవేత్త కుమార్తె. భారత్ లో భాగమైన ఉత్తరాఖండ్ లోని సరిహద్దు ప్రాంతాలు తమవి అంటూ నేపాల్ చేస్తున్న వాదనలకు మద్దతు పలికే వ్యక్తని అమిత్ మాలవీయ పేర్కొన్నారు. చైనా నుంచి నేపాల్ వరకు, భారత ప్రాదేశిక సమగ్రతను ప్రశ్నిస్తున్న వారితోనే రాహుల్ ఎందుకు సంబంధాలు నెరుపుతున్నారు అని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి కీలక క్లిప్ లను కూడా మాలవీయ తన ట్విట్టర్ ఖాతాలో జతపరిచారు. భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలు తమవిగా చూపిస్తూ నేపాల్ ఆ మధ్య మ్యాప్ విడుదల చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీన్ని ఎన్నో దశాబ్దాల క్రితమే చేసి ఉండాల్సిందంటూ సుమ్నిమా ఉదాస్ పెట్టిన పోస్ట్ కూడా మాలవీయ షేర్ చేశారు.
అయితే మోదీ విదేశీ పర్యటనపై కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించడంతో.. రాహుల్ గాంధీ వీడియోతో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది బీజేపీ. రాహుల్ గాంధీ వీడియోను షేర్ చేస్తూ.. కాంగ్రెస్ ప్రధాన మంత్రి అభ్యర్థిగా చెప్పుకునే వ్యక్తి నైట్ క్లబ్‌ల వెంట తిరగమేమిటని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ సొంత పార్టీని నడపటం కంటే.. పార్టీలలో బిజీగా ఉన్నాడని బీజేపీ నేత, బిహార్ మంత్రి సయ్యద్ షానవాజ్ హుస్సేన్ ఎద్దేవా చేశారు. ఇలా బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. అయితే బీజేపీ చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ కూడా గట్టిగానే తిప్పికొడుతుంది. రాహుల్ పార్టీకి హాజరయ్యాడని.. అందులో ఎక్కడ కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అందులో తప్పుపట్టాల్సిన అంశం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ .. బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఓ పార్టీలో పాల్గొన్న ఫొటోను షేర్ చేసి.. ‘‘ఇతనెవరూ..?’’ అని ప్రశ్నించారు.
ఫ్రెండ్ పెళ్లికి హాజరయ్యేందుకు భారత్‌కు మిత్రదేశమైన నేపాల్‌కు రాహుల్ గాంధీ వెళ్లాడని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇది నేరం కాదని పేర్కొంది. 2015లో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా హాజరుకావడంతో పోలిస్తే ఇది చాలా చిన్న విషమని బీజేపీకి కౌంటర్ ఇచ్చింది.