ఢిల్లీలో హై టెన్షన్.. కాంగ్రెస్ భారీ ఆందోళన.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టు

By Mahesh KFirst Published Aug 5, 2022, 3:58 PM IST
Highlights

ఢిల్లీలో కాంగ్రెస్ తీవ్ర ఆందోళన చేపట్టింది. సోనియా గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ నేతలు.. నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలను పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఈ ఆందోళనల నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

న్యూఢిల్లీ: హస్తినలో హైడ్రామా నెలకొంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిత్యావసరాలపై జీఎస్టీ పెంపు వంటి అంశాలను నిరసిస్తూ కాంగ్రెస్ భారీ ఆందోళనకు పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా కాంగ్రెస్ నేతలు నిరసనలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శశిథరూర్ సహా పలువురుని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరుగుతున్నదని కాంగ్రెస్ నిరసనకు పిలుపు ఇచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు నలుపు రంగు వస్త్రాలు ధరించి నిరసనలు చేశారు. ఈడీ దాడులు, వేధింపులను నిరసిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనలు చేయడంతో సభా వాయిదా పడింది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు పీఎం నివాసం ఘెరావ్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు పార్లమెంటు నుంచే ఛలో రాష్ట్రపతి భవన్ చేపడుతున్నట్టు పార్టీ ప్రకటించింది.

కాంగ్రెస్ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో నిషేధాజ్ఞలు అమలు చేశారు. కాంగ్రెస్ మార్చ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. కానీ, కాంగ్రెస్ వెనుకడుగు వేయలేదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు పార్టీ హెడ్ క్వార్టర్ వెలుపల ధర్నా చేస్తుండగా ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్, ప్రియాంక, మరికొందరు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని కింగ్స్‌వే క్యాంప్‌లో ఉంచారు.

click me!