
Rahul Gandhi: అది.. జూలై 10, 1989. ప్రతిష్టాత్మకమైన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఫ్రెషర్స్ డే పార్టీ. విద్యార్థులు, అధ్యాపకులు అందరూ ఉత్సాహంగా , సరదగా గడుపుతున్నారు. ఇంతలో బ్లాక్ సఫారీ సూట్‌లలో సాయుధ కమాండోల పర్యవేక్షణలో కళ్లద్దాలు ధరించిన 5' 7” అబ్బాయి అక్కడకు వచ్చారు. అతని చేతిలో కొన్ని పుస్తకాలు, నోట్‌బుక్, హీరో ఫౌంటెన్ పెన్ను పట్టుకుని ఉన్నాడు. అందరూ ద్రుష్టి అతని మీదే.. అతను ఎవరు? కళాశాల కారిడార్‌లోని ప్రవేశిస్తూ.. తన సెక్యూరిటీ గార్డులను దూరంగా వెళ్లమని సున్నితంగా సూచించాడు. సెయింట్ స్పీఫెన్స్ కాలేజీలో బీఏ హిస్టరీలో సీటు సంపాదించుకుని ఫ్రెషర్ డేలో పాల్గొన్నాడు. ఆ యువకుడు మరెవరో కాదు.. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీ. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ఎంతో మంది ప్రముఖ రాజనీతిజ్ఞులు, రచయితలు, పౌర సేవకులు, పండితులను తయారు చేసింది.
తక్కువ మార్కులున్నా.. అడ్మిషన్ ఎలా..?
ప్రతిష్టాత్మకమైన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ప్రధాని తనయుడు రాహుల్ గాంధీ అడ్మిషన్ రావడం అప్పట్లో చర్చనీయంగా మారింది. ఈ కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే.. కనీసం 70 నుంచి 80 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. కానీ,రాహుల్ గాంధీకి ఇంటర్‌లో 61 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. నిజానికి ఆ మార్కులతో కాలేజీలో సీటు రాదు. అయినా ఈ కాలేజీలో రాహుల్‌కు సీటు వచ్చింది. స్పోర్ట్స్ కోటా వల్ల రాహుల్ గాంధీ ఆ కాలేజీలో సీటు వచ్చింది. ఈ కోటా కింద 10 శాతం మార్కులు కలిశాయంట. దీంతో ఆయనకు సీటు వచ్చింది. ఇంతకీ రాహుల్ గాంధీకి సీటు రావడానికి, ఆయన రాణించిన క్రీడ ఏమింటే.. రైఫిల్ షూటింగ్. 1989 జూలైలో జరిగిన ఢిల్లీ షూటింగ్ పోటీలో రాహుల్ గాంధీ తన పరాక్రమాన్నిప్రదర్శించారు. ఈ పోటీలో స్వర్ణపతకం గెలుచుకున్నారు. జూలై 1989 నాటికి షూటింగ్‌లో ఆయన 8 నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు.
అప్పట్లో వివాదం..
అప్పట్లో రాహుల్‌కు స్పీఫెన్ కాలేజీలో అడ్మిషన్ దక్కడం వివాదంగా మారింది. ఈ సంఘటన అప్పట్లో వార్తాపత్రికల్లో హెడ్‌లైన్స్‌గా మారింది. రాహుల్ గాంధీ పత్రాలు నకిలీవని బీజేపీ పేర్కొంది. అప్పటి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మదన్ లాల్ ఖురానా.. రాహుల్ అడ్మిషన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైఫిల్ షూటింగ్‌లో రాహుల్ ప్రతిభాపాటవాలను ప్రదర్శించలేదనీ, అవన్నీ “నకిలీ” పత్రాలని ఆరోపించారు. ఫేక్ డాక్యుమెంట్స్ తో అడ్మిషన్ పొందారని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పాత్రికేయుడు, రాజీవ్ గాంధీ స్నేహితుడు సుమన్ దూబే రంగంలోకి దిగారు. సెయింట్ స్టీఫెన్స్‌లో రాహుల్ అడ్మిషన్‌ను స్వాగతిస్తూ.. 19 ఏళ్లలోపు ఎంత మంది బాలురు జాతీయ స్థాయిలో ఎనిమిది పతకాలు సాధించారు?” అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో నేషనల్ రైఫిల్ అసోసియోషన్ సైతం రైఫిల్ షూటింగ్‌లో రాహుల్ ప్రతిభాపాటవాలను వెల్లడించింది. డిసెంబర్ 26, 1988 నుండి జనవరి 5, 1989 వరకు న్యూఢిల్లీలో జరిగిన 32వ జాతీయ షూటింగ్ పోటీలలో రాహుల్ 4వ స్థానంలో నిలిచినట్లు టెస్టిమోనియల్స్ చూపించింది. యువ గాంధీ (రాహుల్ గాంధీ) సెంటర్ ఫైర్ పిస్టల్ 25 M (ఇండియన్ రూల్) మెన్స్ సివిల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచాడనీ, 400 పాయింట్లలో 371 పాయింట్లను స్కోర్ చేశారని తెలిపింది. అనేక విభాగాలలో పాల్గొన ఆయన 4వ స్థానాల్లో నిలిచారని వెల్లడించింది.
ఢిల్లీ యూనివర్శిటీ మార్గదర్శకాల ప్రకారం.. పాఠశాల బోర్డు పరీక్షల్లో 40 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన అత్యుత్తమ క్రీడాకారుడు (జాతీయ ఛాంపియన్‌షిప్‌లో స్థానం సంపాదించినవారు) ప్రవేశం పొందేందుకు అనుమతించబడతారు. 1989లో సెయింట్ స్టీఫెన్స్ ఆ సంవత్సరం స్పోర్ట్స్ కోటాలో 40 మంది విద్యార్థులను చేర్చుకుంది. హిస్టరీ (ఆనర్స్) కోర్సులో తొమ్మిది మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.
రాహుల్ కోచ్ , స్వయంగా అంతర్జాతీయ పిస్టల్ షూటర్, కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ డైరెక్టర్ క్లెమెంట్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. "అడ్మిషన్ పొందిన ఇద్దరు ఫుట్‌బాల్ క్రీడాకారులు రాహుల్ కంటే తక్కువ మార్కులు సాధించారు. సీబీఎస్సీ స్కూల్ సర్టిఫికెట్‌లో రాహుల్ 61 శాతం మార్కులు సాధించాడు అని తెలిపారు. జాతీయ పోటీలకు ముందు, తుగ్లగాబాద్ రేంజ్‌లో జరిగిన ఢిల్లీ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో రాహుల్ మూడు స్వర్ణాలు, ఒక రజతం , నాలుగు కాంస్య పతకాలను కైవసం చేసుకున్నాడని తెలిపారు.
సెయింట్ స్టీఫెన్స్‌లోని ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగాధిపతి సుశాంత్ కుమార్ చక్రవర్తి మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటా ద్వారా అడ్మిషన్ పొందిన ఏకైక షూటర్ రాహుల్ కాదు. నిజానికి సెయింట్ స్టీఫెన్స్ కర్ణి సింగ్, హరిసిమ్రాన్ సంధు, మనేషర్ సింగ్, రణధీర్ సింగ్, రాండెప్ మాన్ వంటి చాలా మంది స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ పొందారు. రాహుల్ ప్రధానమంత్రి కుమారుడైనందున, అత్యుత్తమ క్రీడాకారులకు అందించిన సౌకర్యాలను మేము తిరస్కరించలేమని చక్రవర్తి అప్పుడు చెప్పారు.
అ సమయంలో భారత ఒలింపిక్ సంఘం కూడా రాహుల్‌కు మద్దతుగా నిలిచింది. రాహుల్ సమర్పించిన పత్రాలను ఐఓఏ అధ్యక్షుడు, కార్యదర్శిగా ఉన్న బి ఆదిత్యన్, సెక్రటరీ రణధీర్ సింగ్ ధృవీకరించారు. వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుడు అయిన డాక్టర్ రాజ్‌పాల్, వాస్తవాలను ధృవీకరించకుండా ప్రతిపక్షాలు ఎందుకు వివాదాన్ని రేకెత్తించాయని ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. రాహుల్ ఏడాదికే స్టీఫెన్స్ కాలేజీని విడిచిపెట్టి.. ఫ్లోరిడాలోని కేంబ్రిడ్జిలో హైయర్ డిగ్రీ చేరారు. అయితే, తాను చదవినా స్టీఫెన్ కాలేజీని మాత్రం రాహుల్ తరచు సందర్శిస్తుంటారు.