
చండీగడ్: పంజాబ్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. తొలిసారిగా క్రీడాకారులకు స్టైపెండ్ ప్రకటించింది. పంజాబ్ క్రీడా శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ మంగళవారం ఓ స్కాలర్షీప్ స్కీమ్ ప్రకటించారు. జాతీయ స్థాయి పోటీల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి ఏడాది పాటు నెలవారీగా స్టైపెండ్ ఇస్తామని ప్రకటించారు. త్వరలోనే తమ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ ప్రకటిస్తుందని వివరించారు. ఈ పాలసీ కింద అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ తెచ్చిన వారిని నేరుగా ఉద్యోగాల్లోకి రిక్రూట్ చేసుకుంటామని వెల్లడించారు. అంతేకాదు, క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రకటిస్తామని చెప్పారు.
ఒలంపియన్ బల్బీర్ సింగ్ సీనియర్ స్కాలర్షిప్ స్కీమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచే పంజాబ్ ప్లేయర్లకు నెల వారీగా స్టైపెండ్ ఇస్తామని పేర్కొన్నారు. సీనియర్ నేషనల్ చాంపియన్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు ఏడాది పాటు నెలకు రూ. 8 వేల చొప్పున అందిస్తామని తెలిపారు. అదే జాతీయ స్థాయి పోటీల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నెలకు రూ. 6 వేల చొప్పున స్టైపెండ్ అందిస్తామని వివరించారు. ఆ తర్వాత మళ్లీ ఇలాంటి పోటీల్లో గెలిస్తే ఈ స్టైపెండ్ కంటిన్యూ అవుతుందని చెప్పారు.
ఈ స్కీం కోసం రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో రూ. 12.50 కోట్లు రిజర్వ్ చేసిందని ఆయన వివరించారు. స్పోర్ట్స్ పర్సన్స్‌కు స్టైపెండ్ ఇస్తున్న తొలి రాష్ట్రం పంజాబ్ అని చెప్పారు.
స్టైపెండ్ మాత్రమే కాదు.. క్రీడాకారులకు కావాల్సిన ఎక్విప్‌మెంట్లు, కొత్త కోచ్‌లను పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకుంటామని వివరించారు. త్వరలోనే స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్ 220 మంది కొత్త కోచ్‌లను రిక్రూట్ చేసుకుంటుందని, తద్వారా రాష్ట్రంలో స్పోర్ట్స్ యాక్టివిటీ పెంచుతుందని తెలిపారు.