పాటియాలాలో అల్లరిమూకల దాడిలో గాయపడిన ఎస్ఐ హర్జీత్ సింగ్ గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు.
పాటియాలాలో అల్లరిమూకల దాడిలో గాయపడిన ఎస్ఐ హర్జీత్ సింగ్ గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. దాడి జరిగిన తర్వాత ఆయనను ఛండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఆర్)కు తరలించారు. సుమారు 7 గంటల శస్త్రచికిత్స అనంతరం హర్జీత్‌సింగ్‌కు చేతిని అతికించారు.
ఏప్రిల్ 12వ తేదీని సనౌర్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్దకు ఓ వాహనం వచ్చింది. లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో పోలీసులు కర్ఫ్యూ పాసులు చూపించాల్సిందిగా కోరారు. దీనిని ఏ మాత్రం పట్టించుకోని వారు బారికేడ్లను ఢీకొడుతూ ముందుకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు.
అప్రమత్తమైన పోలీసులు వారిని ఆపేందుకు వాహనం దగ్గరకు వెళ్లగా.. అందులో ఉన్న వారు కత్తులు తీసుకుని బయటకు దిగి అధికారులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఏఎస్ఐ హర్జీత్ సింగ్ ఎడమ చేయి తెగిపోయింది.
పాటియాలా స్టేషన్ అధికారి, మరో ఇద్దరు ఏఎస్ఐలు, మార్కెట్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది హర్జీత్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులపై దాడి అనంతరం దుండగులు 25 కిలోమీటర్ల దూరంలోని ఓ గురుద్వారాలో దాక్కున్నారు.
పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ, వారు ఎల్‌పీజీ సిలిండర్లను పేల్చేసి ఆత్మాహుతికి పాల్పడతామని హెచ్చరించారు. అయితే పోలీసులు కాల్పులు జరిపి నిందితులు సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.