
Punjab Assembly Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో రాజకీయ పార్టీల మధ్య .. మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ వైపు బీజేపీ, ఆఫ్ లు అధికారం దక్కాలని ప్రయత్నిస్తే.. మరోసారి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పూర్తి బలాన్ని ప్రయోగిస్తోంది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గురువారం పంజాబ్‌లో పర్యటించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ హోరెత్తిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా పఠాన్‌కోట్‌లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. వారిని బడే మియా, చోటే మియాగా పేర్కొంటూ.. వారిద్దరూ ఆరెస్సెస్ నుంచి ఎదిగిన వారని అన్నారు. గుజరాత్ మోడల్ గా చూపించి .. ప్రధాని చేసింది ఒకటేననీ.. మన దేశాన్ని ఇద్దరు వ్యక్తులకు అమ్మేశారని ప్రియాంక గాంధీ వాద్రా మోడీపై విరుచుకుపడ్డారు. గుజరాత్ మోడల్‌ను మీరు పరిశీలిస్తే ఏ ఒక్కరికి ఉద్యోగాలు అందుబాటులో ఉండవని, వ్యాపారాలు సజావుగా సాగవనీ, ఎలాంటి నిధులూ సమకూరవని తెలుస్తుందని చెప్పారు.
ఇక ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఘనంగా చెప్పుకునే ఢిల్లీ మోడల్‌ను ఉద్దేశిస్తూ.. రోడ్లపై ప్రజలు ఎలా చనిపోతున్నారో మీరు చూశారా?” అని ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు. ఇక ఢిల్లీ మోడల్‌లో ఏ ఒక్క ఆస్పత్రి, విద్యాసంస్ధలను కొత్తగా నిర్మించలేదని ప్రియాంక ఎద్దేవా చేశారు.
పేద కుటుంబ నేపధ్యం కలిగిన సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ.. పంజాబ్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారని కాంగ్రెస్ నేత అన్నారు. 111 రోజుల్లో, పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోగలిగింది. దీనికి ప్రధాన కారణం పంజాబ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేలా చన్నీ పేద కుటుంబం నుంచి రావడమేనని చెప్పుకొచ్చారు.
ఇక అంతకుముందు జలంధర్ లోని ఎన్నికల ర్యాలీలోనూ పాల్గొన్న ప్రియాంక గాంధీ.. ప్రధాని మోడీపై మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ విధానాల వల్లే..రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రమవుతోందనీ, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ ప్రజల మన్ కీ బాత్‌ను వినడం లేదని ఆరోపించారు. ఉద్యోగాల కోసం పంజాబీ ప్రజలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలసబాట పడుతున్నారని ప్రియాంక గాంధీ విమర్శించారు.
ప్రధాని మోదీ తలపాగా ధరించి పంజాబ్ ర్యాలీల్లో ప్రత్యక్షం కావడాన్ని ఉద్దేశించి.. తలపాగా ధరించగానే సర్ధార్ కాలేరని ఎద్దేవా చేసింది. వేదికపై నకిలీ తలపాగాతో దర్శనమివ్వగానే ఎవరూ సర్ధార్జీ కారని వారికి చెప్పండని అన్నారు. నిజమైన సర్ధార్ ఎవరో వారికి చెప్పండి. ఈ తలపాగాలో ఎంతటి ధైర్యం, కఠోరశ్రమ దాగుందో వారికి తెలియచెప్పండని ప్రియాంక పేర్కొన్నారు.
మరోవైపు పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు లేదనేలా కాంగ్రెస్ పార్టీ పలు సంకేతాలు పంపుతోంది. పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనకు సోదరుడి వంటి వాడని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి కీలకమని సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ అన్నారు. ఇక ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.