Punjab Election 2022: పంజాబ్ పీఠం కేజ్రీవాల్ పార్టీదే.. వెల్లడించిన తాజా ఒపీనియన్‌ పోల్.. మరి కాంగ్రెస్..?

By Sumanth KanukulaFirst Published Jan 17, 2022, 12:03 PM IST
Highlights

పంజాబ్ అసెంబ్లీ  ఎన్నికల్లో (Punjab Assembly Election) అధికార కాంగ్రెస్‌కు షాక్ తప్పదని తాజా ఒపీనియన్ పోల్ ఒకటి వెల్లడించింది. పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని పేర్కొంది.
 

పంజాబ్ అసెంబ్లీ  ఎన్నికల్లో (Punjab Assembly Election) అధికార కాంగ్రెస్‌కు షాక్ తప్పదని తాజా ఒపీనియన్ పోల్ ఒకటి వెల్లడించింది. పంజాబ్‌లో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని జన్ కీ బాత్-ఇండియా న్యూస్ నిర్వహించిన పోల్ పేర్కొంది. ఆ ఒపీనియన్ పోల్ ప్రకారం.. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో ఆప్ 58-65 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. 2021‌ డిసెంబర్‌లో ఇదేరకమైన పోల్‌లో ఆప్ 51-57 స్థానాలు గెలుచుకుంటుందని ఆ సంస్థ పేర్కొంది. అయితే తాజాగా ఆ స్థానాలు మరింతగా పెరగడం చూస్తుంటే.. పంజాబ్‌లో ఆప్ మరింత ప్రాబల్యం సాధించినట్టుగా కనిపిస్తోంది.

2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 20 సీట్లు మాత్రమే గెలుచుకున్న ఆప్.. ఈ సారి ఎలాగైనా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఈ మేరకు కొద్ది నెలల నుంచే తీవ్రంగా శ్రమిస్తుంది. అయితే తాజాగా వెలువడిన ఈ ఒపీనియన్ పోల్‌.. ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే విధంగా ఉంది. 

ఆప్‌ వచ్చే సీట్లలో.. మాల్వా ప్రాంతం నుంచి 36-43 సీట్లు రావచ్చని, మంఝా నుంచి 13-15 సీట్లు, దోయాబ్ ప్రాంతాల నుంచి 7-9 సీట్లు రావచ్చని ఆ ఒపీనియన్ పోల్‌ పేర్కొంది. ఆప్‌కు మొత్తంగా 38-39 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మహిళలు క్రేజ్రీవాల్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టుగా ఒపీనియన్ పోల్ పేర్కొంది. అభిప్రాయాలు సేకరించినవారిలో 48 శాతం మహిళలు ఆప్‌ను సమర్దించినట్టుగా తెలిపింది. కులాల ఓట్ల పరంగా కూడా ఆప్ భారీగా లాభపడుతుందని అంచనా వేసింది. 

ఆసక్తికరంగా, రాష్ట్రంలోని మహిళలు కేజ్రీవాల్ పార్టీని ఇష్టపడ్డారు, ప్రతివాదులు 48 శాతం మంది AAPని సమర్థించారు. కులాల ఓట్ల పరంగా కూడా ఆ పార్టీ భారీగా లాభపడుతుందని అంచనా వేసింది. జాట్‌లలో 48 శాతం మంది ఆప్‌కి మద్దతిస్తుండగా.. షెడ్యూల్డ్ కులాలు (42 శాతం), ఇతర వెనుకబడిన తరగతుల (37 శాతం) ఓటర్లు కూడా అనుకూలంగా ఉన్నారు.

పంజాబ్‌లో కాంగ్రెస్ చాలా నష్టం చేకూరనుందని ఈ సర్వే అంచనా వేసింది. ఇందుకు ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భద్రతా లోపం కూడా ముఖ్యమైన అంశంగా మారిందని సర్వే అభిప్రాయపడింది. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది ఈ ఘటన ఓటింగ్‌పై ప్రభావం చూపుతుందని విశ్వసించగా, 40 శాతం మంది ఇతర అభిప్రాయాలను వెల్లడించినట్టుగా తెలిపింది. అదే సమయంలో సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది ప్రధాని భద్రతా లోపం సమస్యను రాజకీయం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం మీద 35 శాతం ఓట్లతో 32 నుంచి 42 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది. అయితే 2021 డిసెంబరులో ఇదే సంస్థ పోల్‌లో కాంగ్రెస్ 40-46 సీట్లు సాధిస్తుందనే అంచనా వెలువడగా.. ఇప్పుడు పరిస్థితి కాంగ్రెస్ మరింత వ్యతిరేకంగా ఉన్నట్టుగా సర్వే గణంకాలు వెల్లడించాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు సగటుగా ఉందని.. సర్వేలో పాల్గొన్న 43.2 శాతం మంది, చరణ్‌జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరు పేలవంగా ఉందని 33.4 శాతం మంది, కేవలం 23.4 శాతం మంది మాత్రమే ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 

ఓటింగ్ ఫలితాలను ప్రభావితం చేసే సమస్యల విషయానికి వస్తే ఓటర్లలో ద్రవ్యోల్బణం (23.4 శాతం) అత్యంత ముఖ్యమైన చర్చనీయాంశంగా ఉందని సర్వే తెలిపింది. నిరుద్యోగం (20.8 శాతం), అభివృద్ధి (16 శాతం), విద్య (10.2 శాతం), మాదక ద్రవ్యాల బెడద (8.9 శాతం), విద్యుత్ (7.6 శాతం), ఆసుపత్రుల కొరత (5.5 శాతం), వ్యవసాయం (5.8 శాతం), నీరు (1.1 శాతం).. ఆ తర్వాత ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. 

బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌లకు షాక్..
ఈ ఒపీనియన్ పోల్ డేటా.. పంజాబ్‌లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మరింతగా దెబ్బతిననున్నాయని అంచనా వేసింది. 2017లో శిరోమణి అకాలీదళ్.. 18 సీట్లు గెలుచుకుంది. అయితే 2021 డిసెబర్‌లో నిర్వహించిన ఇదే సంస్థ ఒపీనియల్ పోల్‌.. ఆ పార్టీ గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేస్తుందని.. 16-21 సీట్లు గెలుచుకుంటుందని అంచనావేసింది. అయితే ఇప్పుడు మాత్రం శిరోమణి అకాలీదళ్‌.. 15-18 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ఇక, గత సర్వేలో బీజేపీ నాలుగు స్థానాలు గెలుచుకుంటుందని చెప్పగా.. తాజాగా మాత్రం అది రెండు స్థానాలకు పరిమితం అవుతుందని అంచనావే సింది. 

ఆప్ విస్తరిస్తున్న తీరు, రద్దు చేయబడిన వ్యవసాయ చట్టాలు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని పోల్‌లో పాల్గొన్న వారిలో 70 శాతం విశ్వసిస్తున్నారని జన్ కీ బాత్-ఇండియా న్యూస్ నిర్వహించిన సర్వే పేర్కొంది. 

click me!