కరోనా తీవ్రత: మార్చి 31 వరకు స్కూళ్లు బంద్.. శుభాకార్యాలపై ఆంక్షలు, సీఎం ప్రకటన

By Siva Kodati  |  First Published Mar 19, 2021, 6:17 PM IST

అటు కేసుల తీవ్రత దృష్ట్యా పంజాబ్‌ ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల ఆంక్షలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. వాటిని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది


కరోనా వైరస్‌ కోరలు చాస్తుండటంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గత కొన్ని రోజులుగా కరోనా టెస్టులతో పాటు కంటైన్‌మెంట్ జోన్లను అధికారులు పెంచుతున్నారు.

ఇప్పటికే మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూతో పాటు లాక్‌డౌన్‌ సైతం విధించారు. అటు కేసుల తీవ్రత దృష్ట్యా పంజాబ్‌ ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల ఆంక్షలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. వాటిని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది.

Latest Videos

undefined

దీనిలో భాగంగా శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంక్షలు అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు. మార్చి 31 వరకు విద్యా సంస్థలన్నీ మూసివేయనున్నట్టు తెలిపారు.

అలాగే, సినిమా థియేటర్లు / షాపింగ్‌ మాల్స్‌పైనా పరిమితులు విధించారు. సినిమా థియేటర్లు 50 శాతం సామర్థ్యంతో నడిచేందుకు అవకాశం కల్పించారు. కరోనా చైన్‌ను బ్రేక్ చేసేందుకు గాను ప్రజలంతా రెండు వారాల పాటు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

శుభకార్యాలు, వేడుకలు ఇతర కార్యక్రమాల్ని పరిమిత సంఖ్యలో తమ ఇళ్లలోనే నిర్వహించుకోవాలని కోరారు. రేపటి నుంచి కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తాయని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. 

మరోవైపు, కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న 11 జిల్లాల్లో మాత్రం ఆదివారం నుంచి సామాజిక కార్యక్రమాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. వివాహాలు, అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20 మందికి మించి హాజరు కావొద్దని సూచించారు.

ఆయా జిల్లాలో రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అమరీందర్ సింగ్ చెప్పారు. అలాగే, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌, రెస్టారెంట్లు, మాల్స్‌ మాత్రం ఆదివారం పూర్తిగా మూసే ఉంచాలని ఆదేశించారు. పరిశ్రమలు, అత్యవసర సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. 

click me!