నారాయణ స్వామి రాజీనామా.. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన !?..

By AN TeluguFirst Published Feb 23, 2021, 11:53 AM IST
Highlights

పుదుచ్చేరిలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బలపరీక్షకు కొన్ని రోజుల ముందు నుంచే రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీని తొలగించడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు.. నారాయణ స్వామి ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేలా చేసింది. 

పుదుచ్చేరిలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బలపరీక్షకు కొన్ని రోజుల ముందు నుంచే రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీని తొలగించడం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు.. నారాయణ స్వామి ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేలా చేసింది. 

ఈ క్రమంలోనే అసెంబ్లీ  బల పరీక్షలో నారాయణస్వామి ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోలేకపోయింది దీంతో సర్కార్ కుప్పకూలింది. ముఖ్యమంత్రి నారాయణ స్వామి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసైకు రాజీనామా సమర్పించారు. 

ఈ పరిణామాలతో 14మంది సభ్యుల మద్దతున్న ఎన్ ఆర్ కాంగ్రెస్ అధికారం చేపడుతుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే రెండు నెలల్లోనే ఎన్నికలు ఉండటం, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుండటంతో ఎన్ ఆర్ కాంగ్రెస్  కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేమని ప్రకటించింది.

దీంతో అటు సీఎం రాజీనామా, ఇటు ఎన్ ఆర్ కాంగ్రెస్  కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేకపోవడంతో పుదుచ్చేరి రాజకీయాలు రసవత్తంగా మారాయి. తాజా పరిణామాల నేపథ్యంలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టిన తమిళిసై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 

అయితే ఈ రాజీనామాలు డ్రామా అని ఇదంతా కేంద్ర పెద్దలకు తెలిసే జరుగుతుందని, వారు చెప్పినట్టే గవర్నర్ చేస్తారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. దీనికే తమిళిసై మొగ్గు చూపే అవకాశం ఉంది. 

ఒకవేళ అదే జరిగితే ఎన్నికల సమయానికి పుదుచ్చేరి రాజకీయాలు మొత్తం కేంద్రంలో ఉన్న బీజేపీ నియంత్రణలోకి వెడతాయి. మరోవైపు, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదని నారాయణ స్వామి భావిస్తే, పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్ట్ నెంట్ గవర్నర్ని కోరే అవకాశాలు ఉంటాయి. 

అయితే ఇప్పటికే నారాయణ స్వామి అసెంబ్లీలో విశ్వాసం కోల్పోవడంతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆయన సలహాను పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉండవని సమాచారం. అయితే ఆమె నేరుగా ఆ నిర్ణయం తీసుకుంటారా..? లేదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ప్రతిపక్షాన్ని అడిగిన తరువాత నిర్ణయం తీసుకుంటారా? అన్నది చూడాలి.

ఈ నేపథ్యంలో పుదుచ్చేరి రాజకీయ భవిష్యత్తు లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిమీదే ఆధారపడి ఉంటుంది.

click me!